పీఏబీఆర్ సమీపంలోనే అక్రమ మైనింగ్
● అక్రమార్కులపై చర్యలు తీసుకోవాలి
● కలెక్టర్‌ను కోరిన మాజీ ఎమ్మెల్యే విశ్వ
అనంతపురం: కూడేరు మండల పరిధిలో పీఏబీఆర్‌కు ఆనుకుని ఉన్న గుట్టలో అక్రమంగా జరుగుతున్న మైనింగ్‌ను తక్షణమే నిలుపుదల చేసి, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఉరవకొండ మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్‌సీపీ పీఏసీ సభ్యుడు వై.విశ్వేశ్వరరెడ్డి కోరారు. శుక్రవారం కలెక్టరేట్‌లోని చాంబర్‌లో కలెక్టర్ ఆనంద్‌ను ఆయన మర్యాదపూర్వకంగా కలిసి, పలు అంశాలపై చర్చించి, వినతిపత్రం అందజేశారు. ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ స్వగ్రామానికి ఐదు కిలోమీటర్ల దూరంలోనే అక్రమ మైనింగ్ నిరాటంకంగా జరుగుతోందన్నారు. అధికార పార్టీ నాయకుల అండతో అక్రమార్కులు ఇప్పటి వరకు దాదాపు రూ.10 కోట్లు విలువ చేసే నల్లరాయి గ్రానైట్‌ను డోన్ ప్రాంతంలోని ఓ ఫ్యాక్టరీకి తరలించేశారన్నారు. పీఏబీఆర్ రెండు గుట్టల మధ్య ఉందన్నారు. పడమటి వైపు మిట్ట ప్రాంతం వరకు ఆనకట్ట కట్టారన్నారు. క్రస్ట్ గేట్లు ఏర్పాటు చేసిన కట్టడం మినహా తక్కిన భాగమంతా ఆనకట్టను రాతి కట్టడంతో పటిష్టపరిచారని తెలిపారు. తూర్పు వైపున ఆనకట్ట మాదిరిగా డ్యాంకు గుట్ట సపోర్ట్‌గా ఉందన్నారు. ఈ గుట్టలోనే విలువైన నల్లరాయి ఉందని చెప్పారు. డ్యాంకు సపోర్ట్‌గా ఉన్న ఈ గుట్టలను పరిరక్షించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. లేకుంటే ప్రాజెక్టుకు ప్రమాదం ఏర్పడనుందని ఆందోళన వ్యక్తం చేశారు.
ఆ భూమిపై స్పష్టత ఇవ్వండి
కూడేరు మండలం బ్రాహ్మణపల్లి సర్వే నంబర్–93లో 136 ఎకరాల భూమి ఎవరికి చెందుతుందో పూర్వాపరాలు పరిశీలించి నిర్ధారణ చేయాలని విశ్వేశ్వరరెడ్డి కలెక్టర్‌ను కోరారు. శోత్రియందారులకు చెందిందా? లేక చెరువుకు సంబంధించినదా అనేది రెవెన్యూ అధికారులు స్పష్టత ఇవ్వాలన్నారు. శోత్రియంకు చెందిన 1800 ఎకరాల భూమిలో 1962 నెల్లూరు సెటిల్మెంట్ అధికారి సీలింగ్ యాక్ట్ ప్రకారం ఎంత భూమిని భూ యజమానులకు అప్పగించారు.. ప్రభుత్వం ఆధీనంలో ఎంత ఉందో వెల్లడించాలన్నారు. లేకుంటే 136 ఎకరాల భూమి ఆక్రమణకు గురవుతుందన్నారు. ఇటీవల ఈ భూమిలో పేదలు వేసుకున్న గుడిసెలను ఉన్నపళంగా ఖాళీ చేయించారని గుర్తు చేశారు. కలెక్టర్‌ను కలిసిన వారిలో వైఎస్సార్‌సీపీ జిల్లా అధికార ప్రతినిధి సీపీ వీరన్న, వైఎస్సార్ విద్యార్థి విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నవీన్ కుమార్‌రెడ్డి, కూడేరు ఎంపీపీ నారాయణరెడ్డి, వైఎస్సార్‌సీపీ మండల అద్యక్షుడు రామచంద్రా రెడ్డి, ఎంపీటీసీ రమేష్ పాల్గొన్నారు.


