బాధ్యతలు విస్మరిస్తే చర్యలు
అనంతపురం అర్బన్: బాధ్యతలు విస్మరించినా, విధుల్లో నిర్లక్ష్యం వహించినా సహించేది లేదని కలెక్టర్ ఆనంద్ ఐడీసీఎస్ అధికారులు, సిబ్బందిని హెచ్చరించారు. కలెక్టర్ శుక్రవారం కలెక్టరేట్ రెవెన్యూ భవన్‌లో అధికారులతో బాల్య వివాహ నిరోధక సమన్వయ కమిటీ సమావేశం, మిషన్ శక్తి జిల్లాస్థాయి సమీక్ష నిర్వహించారు. అనంతరం ఐసీడీఎస్ అధికారులు, సిబ్బందితో ప్రత్యేకంగా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చిన్నపిల్లలు, గర్భిణులు, బాలింతలకు సత్వరం మెరుగైన సేవలందించే ఐసీడీఎస్‌లో అధికారులు, సిబ్బంది బాధ్యతాయుతంగా విధులు నిర్వర్తించాలని ఆదేశించారు. పౌష్టికాహార లోపం కలిగిన వారి వివరాలు పక్కాగా ఉండాలన్నారు. వాస్తవ విరుద్ధంగా నివేదికలు ఇస్తే చర్యలు ఉంటాయని హెచ్చరించారు. బరువు తక్కవకు సంబంధించి సివియర్ కేటగిరీలో ఐదు వేల మంది పిల్లలు ఉండటం ఆందోళన కలిగిస్తోందన్నారు. సివియర్ కండీషన్ కేసులను సూపర్‌వైజర్లు ప్రతి నెలా పర్యవేక్షించి, ఆ కేటగిరీ నుంచి బయటకు తేవాలన్నారు. పిల్లల ఎత్తు, బరువు ఆన్‌లైన్‌లో పక్కాగా నమోదు చేయాలన్నారు. ఐసీడీఎస్‌లో జిల్లా వ్యాప్తంగా 36 వర్కర్, 68 హెల్పర్ మొత్తం 104 పోస్టులు భర్తీకి నోటిఫికేషన్ ఇవ్వాలని ఆదేశించారు. రోస్టర్ సక్రమంగా అమలు చేసి నాలుగు రోజుల్లోగా నివేదించాలన్నారు. నియామకాల్లో నిబంధనలను ఉల్లంఘిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సమావేశంలో పీడీ అరుణకుమారి, డీఎంహెచ్‌ఓ ఈబీ దేవి, అధికారులు పాల్గొన్నారు.
బాల్య వివాహాల నిరోధానికి చర్యలు
జిల్లాలో బాల్యవివాహాలు జరగకుండా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆనంద్ అధికారులను ఆదేశించారు. బాల్యవిహాలు, అత్యాచారాలు, ఉమెన్ ట్రాఫికింగ్, గృహ హింస, వేధింపుల కేసులకు సంబంధించి వన్ స్టాప్ సెంటర్, చైల్డ్ వేల్ఫేర్ కమిటీ, పోలీసులు నమన్వయంతో పనిచేయాలన్నారు. సమావేశంలో జిల్లా లీగల్ అథారిటీ సర్వీస్ కార్యదర్శి ఎన్.రాజశేఖర్, ఐసీడీఎస్ పీడీ అరుణకుమారి, డీఎంహెచ్‌ఓ ఈబీ దేవి, డీసీపీఓ మంజూనాథ్, ఇతర అఽధికారులు పాల్గొన్నారు.
ఐసీడీఎస్ అధికారులకు కలెక్టర్ హెచ్చరిక
నివేదికలు పక్కాగా ఉండాలి
అంగన్‌వాడీ పోస్టుల భర్తీకి ఆదేశం


