పెద్దపప్పూరు: మండల కేంద్రం పెద్దపప్పూరులో శుక్రవారం ఓ పిచ్చికుక్క స్వైరవిహారం చేసింది. ఉదయం ఎనిమిది గంటల సమయంలో ఆర్టీసీ బస్టాండ్ ఆవరణలో ఓ ఏడాదిన్నర వయసున్న భవ్యశ్రీ చెవిని కొరికేసిన పిచ్చికుక్క.. అక్కడే ఉన్న చంద్ర, రామాంజులరెడ్డి, రామక్రిష్ణపై దాడిచేసి గాయపరిచింది. సంఘటన జరిగిన ప్రదేశానికి కూతవేటు దూరంలో ఉన్న ప్రభుత్వాస్పత్రికి బాధితులు వెళితే అక్కడ సిబ్బంది ఎవ్వరూ అందుబాటులో లేరు. దీంతో 108కు సమాచారం అందించారు. అంబులెన్స్ వచ్చిన తర్వాత తాడిపత్రి ఆస్పత్రికి వెళ్లి చికిత్స చేయించుకున్నారు. స్థానికంగా ఆస్పత్రిలో సిబ్బంది అందుబాటులో లేకపోతే అత్యవసర సమయాల్లో పరిస్థితి ఏమిటని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయమై డీడీహెచ్‌ఓ లోకేష్‌కుమార్‌ను ‘సాక్షి’ ఫోన్‌లో సంప్రదించగా సిబ్బంది 24 గంటలూ అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు.
రెవెన్యూ క్రీడలు
విజయవంతం చేయాలి
అనంతపురం అర్బన్: అనంతపురంలో ఈనెల 7 నుంచి 9 వరకు జరగనున్న రాష్ట్రస్థాయి రెవెన్యూ క్రీడలు, సాంస్కృతిక ఉత్సవాలను విజయవంతం చేయాలని కలెక్టర్ ఆనంద్ పిలుపునిచ్చారు. రెవెన్యూ ఉద్యోగుల సంఘం శుక్రవారం స్థానిక కృష్ణకళామందిర్‌లోని రెవెన్యూ హోమ్ వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరై క్రీడా ఉత్సవాల బెలూన్‌ను ఎగరవేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆర్డీటీ స్టేడియంలో మూడు రోజులుపాటు జరగనున్న రాష్ట్రస్థాయి రెవెన్యూ క్రీడల నిర్వహణకు, విజయవంతానికి జిల్లా యంత్రాంగం సంపూర్ణ సహకారం అందిస్తోందన్నారు. కార్యక్రమంలో ఎఫ్‌ఎస్‌ఓ జి.రామకృష్ణారెడ్డి, ఆర్డీఓ కేశవనాయుడు, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు ఆనంద్, రామ్మోహన్, మల్లికార్జునరెడ్డి, రెవెన్యూ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు దివాకర్‌రావు, సోమశేఖర్, తహసీల్దార్ మోహన్‌కుమార్, స్పోర్ట్స్ అండ్ కల్చరల్ సంఘం అధ్యక్ష, కార్యదర్శులు సంజీవరెడ్డి, హరిప్రసాద్‌రెడ్డి, రెవెన్యూ క్రెడిట్ సొసైటీ కోశాధికారి సంజీవరాయుడు, రెవెన్యూ ఉద్యోగుల సంఘం మహిళ అధ్యక్షురాలు సురేఖరావు, నాయకులు రేఖ, పునీత్‌బాబు, సంజీవ్, తదితరులు పాల్గొన్నారు.
బెంగళూరులో
జిల్లా రైతుల నిరసన
కళ్యాణదుర్గం: ఆరుగాలం కష్టించి సాగు చేసిన కర్భూజా, కళింగర పంటను మార్కెట్‌కు తరలిస్తే పంటను అమ్మి సొమ్ము చేసుకున్న వ్యాపారి డబ్బు ఇవ్వకుండా మోసగించాడంటూ బెంగళూరులోని ఏఆర్ అన్వర్ మండీ వద్ద జిల్లా రైతులు శుక్రవారం ఆందోళనకు దిగారు. కళ్యాణదుర్గం, కంబదూరు, శెట్టూరు, కుందుర్పి, బ్రహ్మసముద్రంతో పాటు మడకశిర, హిందూపురం, కర్ణాటక రాష్ట్రం వైఎన్‌హెచ్ కోట, పావగడ ప్రాంతాలకు చెందిన రైతులు పాల్గొన్నారు. నాలుగు నెలలుగా మార్కెట్‌కు తరలించిన పంటకు సదరు మార్కెట్ మండీ యజమాని కాంతరాజ్ డబ్బు ఇవ్వకుండా వేధిస్తున్నాడంటూ రైతుల వద్ద పంట కొనుగోలు చేసిన వ్యాపారులు శ్రీరాములు, పాతిరెడ్డి, తిమ్మరాజు, తిమ్మారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నాలుగు నెలలకు గాను సుమారు రూ.కోటి వరకు మండీ యజమాని చెల్లించాల్సి ఉందన్నారు. తన వద్ద డబ్బు లేదని, ఒత్తిడి చేస్తే చనిపోతానంటూ బెదిరింపులకు దిగుతున్నాడంటూ వాపోయారు. తమకు న్యాయం చేయాలంటూ బెంగళూరు మార్కెట్ యార్డ్ కమిటీ యాజమాన్యానికి ఫిర్యాదు చేశారు.
పిచ్చికుక్కదాడిలో నలుగురికి గాయాలు
పిచ్చికుక్కదాడిలో నలుగురికి గాయాలు


