టీచర్లతో పెట్టుకోవద్దు బాబూ..
అనంతపురం సిటీ: ఉపాధ్యాయులకు వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటూ సీఎం చంద్రబాబు అనేక ఇబ్బందులకు గురి చేస్తున్నారని వైఎస్సార్‌టీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు ఓబుళపతి మండిపడ్డారు. ‘నేను మారాను.. నేను మారాను.. అంటుంటే ఏమో అనుకున్నాం గానీ చంద్రబాబు మారిందేమీ లేదు. ఉపాధ్యాయులతో పెట్టుకోవద్దు బాబూ..’అంటూ హెచ్చరించారు. అనంతపురంలో ఆదివారం ఏర్పాటు చేసిన ఫెడరేషన్ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై, మాట్లాడారు. ఏళ్ల తరబడి ఉపాధ్యాయ వృత్తిలో కొనసాగుతున్న వారికి మళ్లీ టెట్ నిర్వహించాలని నిర్ణయం తీసుకోవడం దుర్మార్గమైన ఆలోచన సరైంది కాదన్నారు. ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులకు టెట్ నుంచి పూర్తిగా మినహాయింపు ఇవ్వాలని డిమాండ్ చేశారు. బోధనేతర కార్యక్రమాల నుంచి మినహాయింపు ఇవ్వాలన్నారు. చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న ఉపాధ్యాయుల సరెండర్ లీవ్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని ఫెడరేషన్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ హెచ్.గిరిధర్‌రెడ్డి కోరారు. 12వ పీఆర్‌సీని నియమించడంతో పాటు 30 శాతం మధ్యంతర భృతి ప్రకటించాలన్నారు. లేకపోతే ప్రభుత్వంపై పోరాటాలకు దిగుతామని హెచ్చరించారు. సమావేశంలో ఫెడరేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు జగదీష్‌రెడ్డి, రాష్ట్ర కార్యదర్శులు డాక్టర్ వెంకటరెడ్డి, అల్తాఫ్ హుస్సేన్, జిల్లా అధ్యక్షుడు వీరాంజనేయులు, ప్రధాన కార్యదర్శి త్యాగరాజు నాయక్ తదితరులు పాల్గొన్నారు.
వైఎస్సార్‌టీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు ఓబుళపతి


