నమ్మకం లేకే మీ వద్దకు రావడం లేదు శ్రీరామ్
అనంతపురం ఎడ్యుకేషన్: ‘మీరంటే ఈ ప్రాంత ప్రజలకు భయం ఉంది. గతంలో 14 ఇళ్లను నేలమట్టం చేశారు... ఇప్పుడు తమ ఇళ్లకూ అదే గతి పడుతుందేమోనని భయపడుతున్నారు.అంతకుముందు విద్యారణ్యనగర్‌లో 6 కోట్ల దాకా వసూళ్లు చేశారు. ఇప్పుడూ అలాగే వసూళ్లు చేస్తారేమోననే భయం ఆ ప్రాంత ప్రజల్లో ఉంది. అందుకే మీ వద్దకు రావడం లేదు’ అని రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి అన్నారు. శనివారం స్థానిక వైఎస్సార్‌సీపీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తమ ఇంటి వద్దకు బాధితులు రాలేదు, బాధ్యులు రాలేదని ఎమ్మెల్యే పరిటాల సునీత కుమారుడు శ్రీరామ్ అంటున్నారని, ప్రజలకు కష్టం వస్తే మరి మీరెందుకు ఉన్నట్లు అని ప్రశ్నించారు. ఎంత కష్టం వచ్చినా మీపై నమ్మకం లేకే ప్రజలు మీవద్దకు రావడం లేదని అన్నారు. ‘మా వద్దకు ఎవరూ రావడం లేదని, వస్తే సెటిల్‌మెంట్ చేస్తానని శ్రీరామ్ చెబుతున్నాడు. అంతా తెలిసిన మీ అమ్మ మొద్దునిద్ర పోతోందా, లేదంటే నటిస్తోందో తెలీదు. మీ కుటుంబం అంతా వచ్చి ఈ ప్రాంత ప్రజల కాళ్లు పట్టుకుని క్షమాపణలు చెప్పాలి. నేలమట్టమైన 14 ఇళ్ల యజమానుల కాళ్లు పట్టుకోవాలి. నేను అడిగే ప్రశ్నలకు పరిటాల సునీత సమాధానం చెప్పాలి. ఈ ప్రాంతానికి శాసనసభ్యుడిగా పని చేసిన బాధ్యతతో ప్రతిపక్ష నాయకుడిగా నేను మాట్లాడుతున్నా. నువ్వు రాజకీయ అజ్ఞానివి.. నీకు ఏ సంబంధం ఉందని మాట్లా డుతున్నావ్’ అంటూ పరిటాల శ్రీరామ్‌పై మండిపడ్డారు.
ఫేక్ డాక్యుమెంట్లతో వస్తే ఖబడ్దార్
రాచూరి, గొల్లపల్లి కుటుంబ సభ్యులు, జీపీఏ దారులు ఫేక్ డాక్యుమెంట్లతో వస్తే ఖబడ్దార్ అంటూ మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి హెచ్చరించారు. దొంగ పొజిషన్ సర్టిఫికెట్లతో కోర్టుకు వెళ్లినా, అధికారాన్ని అడ్డుపెట్టుకుని ఈ ప్రాంత ప్రజల నుంచి రూ. కోట్లు వసూళ్లు చేద్దామనే ఆలోచనతో వస్తే తస్మాత్ జాగ్రత్త అంటూ వార్నింగ్ ఇచ్చారు.సమావేశంలో అనంతపురం రూరల్ జెడ్పీటీసీ సభ్యుడు చంద్రకుమార్, వైస్ ఎంపీపీ కృష్ణారెడ్డి, మండల కన్వీనర్ గోవిందరెడ్డి, నాయకులు గోపాల్‌రెడ్డి, మాదన్న, ఈశ్వరయ్య, నారాయణరెడ్డి, కుమ్మెత గోపాల్‌రెడ్డి, ఎంపీటీసీ సభ్యుడు సందీప్‌యాదవ్ తదితరులు పాల్గొన్నారు.
పన్నాగం పారలేదనే ప్రజల ముందుకు
ఇళ్లు ఉన్న కాలనీలను ఓపెన్‌ల్యాండ్‌గా చూపిస్తూ పొజిషన్ సర్టిఫికెట్లు ఇవ్వడం దొంగతనం కాదా అని ప్రకాష్ రెడ్డి నిలదీశారు. అది మీరు వేయించుకున్న మండల సర్వేయర్ చేసింది కాదా అని ప్రశ్నించారు. అడంగల్ పరిశీలిస్తే అక్కడ ఏపీఐఐసీ, నివాస గృహాలు, రస్తాలు ఉన్నాయని తెలుస్తుందన్నారు. తాము అందరి డొల్లతనాన్ని బయటకు తీసిన తర్వాత అందరూ దిగొచ్చారన్నారు. నిన్నటి రోజున తహసీల్దార్ జీపీకి రాసిన నివేదికను ముందే ఎందుకు పంపలేదని ప్రశ్నించారు. ఇక్కడ అనేక గృహాలు నిర్మాణమై ఉన్నాయని, ఇనామ్ రద్దు చట్టం వచ్చిన తర్వాత శోత్రియం భూములకు ఎలాంటి విలువ ఉండదని నివేదిక ఇచ్చారని, ఇంత జరిగాక పన్నాగం పారలేదనే పరిటాల శ్రీరామ్ నేడు ప్రజల ముందుకు వచ్చాడన్నారు.
గతంలో 14 ఇళ్లు మీరే కూల్చేయించారనే భయం ప్రజల్లో ఉంది
నువ్వు కాదు.. మీ అమ్మను
సమాధానం చెప్పమను
రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి


