బిగుస్తున్న ఉచ్చు
రాప్తాడురూరల్: పాపంపేట శోత్రియం భూముల అక్రమాల వ్యవహారంలో అనంతపురం రూరల్ మండల సర్వేయర్ రఘునాథ్, పాపంపేట వీఆర్‌ఓగా పని చేసిన రఘుయాదవ్ చుట్టూ ఉచ్చు బిగుసుకుంటోంది. ముఖ్యంగా సర్వేయర్ అడ్డంగా బుక్ అయ్యారు! ఏకంగా 176 ఎకరాలు సర్వే చేసి రాచూరి కుటుంబ సభ్యులు, వారి నుంచి జీపీఏలు చేయించుకున్నవారు అనుభవంలో ఉన్నారంటూ సర్వేయర్ అధికారికంగా నివేదికలు ఇచ్చారు. పైగా ఇవన్నీ వ్యవసాయ భూములుగా పేర్కొన్నారు. వాస్తవానికి ఇక్కడన్నీ ఇళ్లు, పెద్దపెద్ద భవనాలు ఉన్నాయి. కాలనీలు ఏర్పాటయ్యాయి. ఇవేవీ పట్టించుకోకుండా సర్వేయర్ ఏకపక్షంగా రిపోర్టులు ఇవ్వడం దుమారం రేపుతోంది. అలాగే సర్వేయర్ పొజిషన్ సర్టిఫికెట్లు ఇవ్వడాన్ని కలెక్టర్ ఆనంద్ సీరియస్‌గా పరిగణించారు. ఈ వ్యవహారంపై విచారణాధికారిగా సర్వే ఏడీ రూప్లా నాయక్‌ను నియమించారు.
వీఆర్‌ఓ పాత్రపైనా అనుమానాలు
పాపంపేట వీఆర్‌ఓగా పని చేసిన రఘుయాదవ్ కూడా పొజిషన్ సర్టిఫికెట్లు జారీ చేశారు. అయితే ఈ వ్యవహారం బయటపడిన తర్వాత ‘నా సంతకాన్ని ఫోర్జరీ చేశార’ని వీఆర్‌ఓ చెబుతున్నారు. అదే నిజమైతే పోలీసులకు ఎందుకు ఫిర్యాదు చేయలేదనే అంశంపై ఉన్నతాధికారులు సీరియస్‌గా ఉన్నారు. విచారణ పూర్తయితే ఈయనపై కూడా చర్యలుంటాయనే చర్చ రెవెన్యూ ఉద్యోగుల్లో సాగుతోంది.
ఆ డాక్యుమెంటుకు చట్టబద్ధత ఉండదు : ఆర్డీఓ
296 ఎకరాలు ఆక్రమించుకునేందుకు చేసిన జీపీఏ (నాన్ రిజిస్టర్) డాక్యుమెంటుకు చట్టబద్ధత ఉండదని అనంతపురం ఆర్డీఓ కేశవ నాయుడు స్పష్టం చేశారు. ఎవరైనా ఆ డాక్యుమెంట్ ఆధారంగా దౌర్జన్యం చేసినా, బెదిరించినా మీ వద్ద ఉన్న హక్కుపత్రాల ఆధారంగా పోలీసులకు ఫిర్యాదు చేయాలని పాపంపేట వాసులకు సూచించారు.
పాపంపేట భూములకు అడ్డగోలు పొజిషన్ సర్టిఫికెట్లపై విచారణకు ఆదేశించిన కలెక్టర్
విచారణాధికారిగా రూప్లానాయక్ నియామకం
అడ్డంగా బుక్కయిన సర్వేయర్, వీఆర్‌ఓ!


