29 మండలాల్లో వర్షం
అనంతపురం అగ్రికల్చర్: వాయుగుండం ప్రభావంతో జిల్లా వ్యాప్తంగా వర్షాలు కొనసాగుతున్నాయి. శుక్రవారం రాత్రి నుంచి శనివారం ఉదయం వరకు 29 మండలాల పరిధిలో 11.4 మి.మీ సగటు వర్షపాతం నమోదైంది. గుంతకల్లు 34.4 మి.మీ, రాప్తాడు 34.2, పుట్లూరు 32.4, కూడేరు 32, నార్పల 26.6, గుత్తి 24.8, బొమ్మనహాళ్ 21.2, కంబదూరు 21.2, విడపనకల్లు 16.4, యాడికి 16, గార్లదిన్నె 13.4, శింగనమలలో 11.4 మి.మీ వర్షం కురిసింది. మిగతా మండలాల్లో తేలికపాటి వర్షం పడింది. అక్టోబర్ నెల సాధారణ వర్షపాతం 100.9 మి.మీ కాగా.. ప్రస్తుతానికి 97.4 మి.మీ నమోదైంది. రాగల రెండు రోజులూ జిల్లాకు వర్షసూచన ఉన్నట్లు వాతావరణ శాస్త్రవేత్తలు తెలిపారు.
సహాయక చర్యలకు రూ.కోటి
అనంతపురం అర్బన్: భారీ వర్షాలు, వరదల సమయంలో అత్యవసర పనులు, సహాయక చర్యలు చేపట్టేందుకు ప్రభుత్వం జిల్లాకు రూ.కోటి మంజూరు చేసింది. నిధులను ఖర్చు చేసేందుకు కలెక్టరుకు అనుమతి ఇస్తూ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది.
22ఏ ఫైళ్లు సమగ్రంగా ఉండాలి
అనంతపురం అర్బన్: ‘‘నిషేధిత భూముల (22ఏ) జాబితాకు సంబంధించిన ఫైళ్లు సమగ్రంగా ఉండాలి. అప్పుడే వాటికి ఆమోదం లభిస్తుంది. దీన్ని దృష్టిలో ఉంచు కుని నిబంధనలకు అనుగుణంగా ఫైళ్లను సిద్ధం చేయండి’’ అని కలెక్టర్ ఓ.ఆనంద్ ఆర్‌డీఓలు, తహసీల్దార్లను ఆదేశించారు. 22ఏ భూముల ఫైళ్ల పరిష్కారానికి కలెక్టరేట్‌లోని రెవెన్యూభవన్‌లో చేపట్టిన రెండో విడత ప్రత్యేక డ్రైవ్‌లో శనివారం కలెక్టర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 1954 జూన్ 18కి ముందు అసైన్డ్ అయిన వాటికే ఎన్‌ఓసీ లభిస్తుందన్నారు. నిర్దేశించిన తేదీ తరువాత అసైన్డ్ అయిన భూములు 22ఏ జాబితా నుంచి తొలగించడం సాధ్యపడదని, అలాంటివి తిరస్కరణకు గురవుతాయన్నారు. కార్యక్రమంలో జేసీ శివ్‌నారాయణ్ శర్మ, డీఆర్‌ఓ ఎ.మలోల, ఆర్‌డీఓలు కేశవనాయుడు, వసంతబాబు పాల్గొన్నారు.
రేపు ‘పరిష్కార వేదిక’
అనంతపురం అర్బన్: ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని ఈ నెల 27న కలెక్టరేట్‌లో నిర్వహించనున్నట్లు కలెక్టర్ ఓ.ఆనంద్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. రెవెన్యూ భవన్‌లో ఉదయం తొమ్మిది నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు నిర్వహించే కార్యక్రమంలో ప్రజలు తమ సమస్యలను అర్జీ రూపంలో అధికారులకు సమర్పించాలని సూచించారు.
బైక్ సర్వీసుకు అదనపు చార్జీల వసూలుపై కొరడా
● తిప్పయ్య మోటార్స్‌కు
రూ.25 వేల జరిమానా
అనంతపురం: బైక్ సర్వీసుకు అదనపు చార్జీలు వసూలు చేసిన తిప్పయ్య మోటార్స్‌పై వినియోగదారుల కమిషన్ కొరడా ఝళిపించింది. వివరాలు.. నగరంలోని అరుణోదయ కాలనీకి చెందిన అబ్దుల్ గఫూర్ తన హీరో హోండా స్ప్లెండర్ బైక్‌ను ఆర్‌ఎఫ్ రోడ్డులోని తిప్పయ్య మోటార్స్‌లో సర్వీస్ చేయించాడు. రెగ్యులర్ సర్వీసులో భాగంగా హెడ్‌లైట్, మరికొన్ని మరమ్మతులు చేయించి ఇందుకు రూ.1,318 బిల్లు చెల్లించాడు. అయితే, తిప్పయ్య మోటార్స్ సిబ్బంది ఇచ్చిన బిల్లులో ఎక్కువ సర్వీసు చార్జీలు వసూలు చేసినట్లు అబ్దుల్ గఫూర్ గుర్తించాడు. దీనిపై మేనేజర్‌ను సంప్రదించినా సరైన సమాధానం రాలేదు. దీంతో తిప్పయ్య మోటార్స్‌కు లీగల్ నోటీసు పంపి వినియోగదారుల కమిషన్‌లో కేసు దాఖలు చేశాడు. వినియోగదారుడికి ఒక తరహాలో, ప్రభుత్వానికి చూపే జమా ఖర్చుల్లో మరో తరహా బిల్లును ఇస్తున్నట్లు కమిషన్ దృష్టికి తీసుకెళ్లాడు. విచారణ చేపట్టిన కమిషన్.. నైట్రోజన్ గాలికి రూ.20, ఇందుకు అదనంగా జీఎస్టీ రూ.3.60 వసూలు చేయడం సేవాలోపంగా గుర్తించింది. అదనంగా సర్వీసు చార్జీలను వసూలు చేస్తున్న తిప్పయ్య మోటార్స్ కు రూ.25 వేల జరిమానాతో పాటు కోర్టు ఖర్చులకు రూ.5 వేలు చెల్లించాలని ఆదేశించింది. ఇలాంటివి పునరావృతమైతే పెద్ద మొత్తంలో జరిమానా విధిస్తామని వినియోగదారుల కమిషన్ అధ్యక్షురాలు ఎం. శ్రీలత, సభ్యులు డి. గ్రేస్‌మేరీ, బి. గోపీనాథ్ హెచ్చరించారు.
29 మండలాల్లో వర్షం


