● నేత్రదానం | - | Sakshi
Sakshi News home page

● నేత్రదానం

Oct 16 2025 5:55 AM | Updated on Oct 16 2025 5:55 AM

●   నేత్రదానం

● నేత్రదానం

శింగనమల(నార్పల): మరణానంతరం నేత్ర దానంతో మరో ఇద్దరికి కంటి చూపును ప్రసాదించారు నార్పలకు చెందిన రామాంజనేయులు కుటుంబసభ్యులు. బుధవారం తెల్లవారుజామున రామాంజనేయులు గుండెపోటుతో మృతి చెందారు. అంతటి విషాదంలోనూ బాధిత కుటుంబ సభ్యులు సహృదయంతో ఆలోచించి మృతుడి నేత్రాలను దానం చేస్తున్నట్లు ఇండియన్‌ రెడ్‌క్రాస్‌ సొసైటీకి తెలిపారు. దీంతో సొసైటీ బృందం అక్కడకు చేరుకుని రామాంజనేయులు మృతదేహం నుంచి నేత్రాలను సేకరించింది. నేత్రాలను దానం చేసిన రామాంజనేయులు భార్య రాజేశ్వరి, కుమారుడు త్రిగుణ, చెల్లెళ్లు భారతి, శ్రీదేవిని పలువురు అభినందించారు.

మహిళలతో మందుబాబుల అనుచిత ప్రవర్తన

కళ్యాణదుర్గం: మండలంలోని నారాయణపురం గ్రామంలో మందుబాబులు రాత్రి సమయాల్లో హంగామా చేస్తున్నారు. మద్యం సేవిస్తూ అటుగా వెళుతున్న మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తూ భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. తాజాగా మంగళవారం రాత్రి స్థానిక పాత అంగన్‌వాడీ కేంద్రం వద్ద ఫూటుగా మద్యం సేవించిన గ్రామానికి చెందిన పి.రామాంజనేయులు, జి. రామాంజనేయులు అనే ఇద్దరు యువకులు నానా హంగామా చేశారు. కొల్లాపురమ్మ ఆలయానికి వెళ్తున్న మహిళలను అసభ్యంగా మాట్లాడుతూ కవ్వింపు చర్యలకు దిగారు. స్థానికుల నుంచి విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని మందుబాబులను అదుపులోకి తీసుకున్నారు. వేళాపాళ లేకుండా గ్రామాల్లో బెల్టుషాపుల ద్వారా మద్యం విక్రయిస్తున్నారని, ఫలితంగా గతంలో ఎన్నడూ లేని విధంగా మద్యం సేవించి గ్రామంలోని యువకులు పెడదోవ పడుతున్నారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. మద్యం విక్రయాలను నియంత్రించాలని డిమాండ్‌ చేశారు.

25 లోపు ఈ–క్రాప్‌

చేయించుకోండి : జేడీఏ

గార్లదిన్నె: ఈ నెల 25వ తేదీ లోపు ఈ–క్రాప్‌ నమోదు చేసుకోవాలని పంటలు సాగు చేసిన రైతులకు జిల్లా వ్యవసాయాధికారి ఉమామహేశ్వరమ్మ సూచించారు. గార్లదిన్నె మండలం కమలాపురం, మర్తాడు గ్రామాల్లో బుధవారం వ్యవసాయ అధికారులు చేపట్టిన ఈ–క్రాప్‌ నమోదు ప్రక్రియను ఏడీ అల్తాప్‌ అలీఖాన్‌తో కలసి ఆమె పరిశీలించారు. ఖరీఫ్‌ సీజన్‌లో రైతులు సాగు పంటలకు ఈ–క్రాప్‌ నమోదు వేగవంతం చేయాలని సిబ్బందిని ఆదేశించారు. కార్యక్రమంలో మండల వ్యవసాయాధికారి సోమశేఖర్‌, రైతు సేవా కేంద్రం సిబ్బంది అనూష, మహేశ్వరి, శశిధర్‌, రైతులు తదితరులు పాల్గొన్నారు.

మహిళ అనుమానాస్పద మృతి

రాప్తాడురూరల్‌: అనంతపురం రూరల్‌ మండలం కురుగుంట ఎస్సీ కాలనీకి చెందిన ఓ మహిళ అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. ఈ మేరకు బుధవారం రూరల్‌ పోలీసులు కేసు నమోదు చేశారు. వివరాలు.. ఎస్సీ కాలనీలో నివాసముంటున్న మీనుగ సుబ్బయ్య, ఈశ్వరమ్మ దంపతుల ఇంట్లో మంగళవారం రాత్రి వారి మనవరాలు, ఆమె భర్త గొడవపడ్డారు. ఈశ్వరమ్మ సర్ది చెప్పేందుకు ప్రయత్నించింది. కాసేపటి తర్వాత బయటకు వచ్చిన ఆమె కళ్లు తిరుగుతున్నాయంటూ కుప్పకూలింది. కుటుంబసభ్యులు ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతిచెందింది. దీంతో ఈశ్వరమ్మ మృతిపై అనుమానాలు వ్యక్తం చేస్తూ భర్త సుబ్బయ్య చేసిన ఫిర్యాదు మేరకు అనంతపురం రూరల్‌ పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

ఆర్టీసీ విశ్రాంత ఉద్యోగి

ఆత్మహత్య

రాప్తాడు: మండలంలోని గంగలకుంట గ్రామ రైల్వే గేట్‌ సమీపంలో రైలు కింద పడి ఆర్టీసీ విశ్రాంత ఉద్యోగి ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబ సభ్యులు తెలిపిన మేరకు.... నార్పలకు చెందిన ఆర్టీసీ విశ్రాంత ఉద్యోగి లక్ష్మీనారాయణ (75) కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. పలు ఆస్పత్రుల్లో చికిత్స పొందినా ఫలితం కనిపించలేదు. దీంతో కుటుంబ సభ్యులకు భారం కాకూడదని భావించిన ఆయన బుధవారం రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. కాగా, లక్ష్మీనారాయణకు భార్య నారాయణమ్మ, ఓ కుమార్తె ఉన్నారు. ధర్మవరం రైల్వే పోలీసులు కేసు నమోదు చేశారు.

కాలువలో వ్యక్తి మృతదేహం

కనగానపల్లి: ఆత్మకూరు మండలం పంపనూరు సమీపంలో హంద్రీ–నీవా కాలువలో గల్లంతైన వ్యక్తి మృతదేహం కనగానపల్లి మండలం బాలేపాళ్యం సమీపంలో కాలువలో బయటపడింది. పోలీసులు తెలిపిన మేరకు.. అనంతపురం రూరల్‌ మండలం కురుగుంటకు చెందిన నాగభూషణ (65) రెండు రోజుల క్రితం పంపనూరు వద్ద హంద్రీనీవా కాలువలో ఈ కొడుతూ నీటి ప్రవాహానికి కొట్టుకుపోయాడు. దీంతో గాలింపు చర్యలు చేపట్టిన పోలీసులు కాలువ వెంబడి పరిశీలిస్తూ ముందుకు సాగారు. బాలేపాళ్యం సమీపంలో హంద్రీనీవా కాలువలో బుధవారం కనిపించిన మృతదేహాన్ని వెలికితీశారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి, విచారణ చేపట్టారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement