
పారిశ్రామిక వేత్తలను ప్రోత్సహించండి : కలెక్టర్
అనంతపురం అర్బన్: జిల్లాలో పరిశ్రమల స్థాపనకు ముందుకు వచ్చే పారిశ్రామిక వేత్తలను అన్ని విధాలుగా ప్రోత్సహించాలని ఏపీఐఐసీ అధికారులను కలెక్టర్ ఓ.ఆనంద్ ఆదేశించారు. ఏపీఐఐసీ ఇండస్ట్రియల్ పార్టనర్‌షిప్ డ్రైవ్‌లో భాగంగా రూపొందించిన పోస్టర్లను కలెక్టర్ బుధవారం కలెక్టరేట్‌లోని తన చాంబర్‌లో ఏపీఐఐసీ అధికారులతో కలిసి ఆవిష్కరించి, మాట్లాడారు. పరిశ్రమల ఏర్పాటుతోనే యువతకు ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నారు. పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించే దిశగా ప్రభుత్వ పథకాలపై అవగాహన కల్పించాలన్నారు. ఇందు కోసం బుధవారం నుంచి నెలరోజుల పాటు జిల్లావ్యాప్తంగా ఏపీఐఐసీ ఇండస్ట్రియల్ పార్టనర్ షిప్ డ్రైవ్‌ను విజయవంతంగా నిర్వహించాలని సూచించారు. కార్యక్రమంలో ఏపీఐఐసీ జోనల్ మేనేసర్ ఎస్‌వీఎస్‌ఎస్ నాగకుమార్, మేనేజర్ మల్లికార్జున, అధికారులు పాల్గొన్నారు.
నిబంధనల మేరకే టపాసుల విక్రయాలు
దీపావళిని పురస్కరించుకుని టపాసుల విక్రయాలు ప్రభుత్వ నిబంధనల మేరకు జరిగేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను కలెక్టర్ ఓ.ఆనంద్ ఆదేశించారు. టపాసుల విక్రయాలపై జిల్లా యంత్రాంగం చేపట్టాల్సిన చర్యలపై కలెక్టర్ బుధవారం కలెక్టరేట్ నుంచి డీఆర్‌ఓ మలోలతో కలిసి ఎస్పీ జగదీష్, డివిజన్‌స్థాయి అధికారులు, తహసీల్దార్లు, మునిసిపల్ కమిషనర్లు, అగ్నిమాపక, విపత్తు, విద్యుత్, ఆరోగ్య, వాణిజ్య పనుల శాఖల అధికారులతో జూమ్ కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. నిబంధనల మేరకు దుకాణాలు ఉండేలా చర్యల తీసుకోవాలని ఆదేశించారు.
పర్యాటక అభివృద్ధి లక్ష్యం
జిల్లాలోని పర్యాటక ప్రదేశాల అభివృద్ధి లక్ష్యంగా కార్యాచరణ రూపొందించుకుని చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులను కలెక్టర్ ఓ.ఆనంద్ ఆదేశించారు. పర్యాటక స్థలాల అభివృద్ధిపై బుధవారం కలెక్టరేట్‌లోని మినీ కాన్ఫరెన్స్ హాల్‌లో అధికారులు, పర్యాటక సంరక్షణ సంఘాల ప్రతినిధులతో కలెక్టర్ సమావేశమై మాట్లాడారు. తాడిపత్రి, ఉరవకొండ, అనంతపురం, కసాపురం, గుత్తికోట, పెన్నహోబిలం, పెనకచెర్ల, వజ్రకరూరు, గూగూడు, హంపాపురం, తదితర పర్యాటక ప్రదేశాల అభివృద్ధికి స్వచ్ఛంద సంస్థలు, సామాజిక సేవకులు, ఛారిటీలు, తదితర సేవ సంస్థలు ముందుకు రావాలని సూచించారు. జిల్లాలో డిజిటల్ టూరిజాన్ని పోత్సాహించాలన్నారు. నగరంలో శిల్పారామాన్ని అభివృద్ధి చేసి స్థానిక కళాకారుల ఉత్పత్తులను ప్రదర్శన, విక్రయాలకు కేంద్రంగా తీర్చిదిద్ధాలన్నారు. సమావేశంలో పర్యాటక శాఖాధికారి జయకుమార్, డీఈఓ ప్రసాద్‌బాబు, డ్వామా పీడీ సలీంబాషా, శిల్పారామం మేనేజర్ శివారెడ్డి, చరిత్ర ప్రొఫెసర్ సుధాకర్, పర్యాటక సంరక్షణ సంఘాల ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.
శిశువు మృతి కారకులను ఉపేక్షించారా?
అనంతపురం రూరల్: శిశుగృహలో నవజాత శిశువు మృతికి కారణమైన వారిని ఉన్నతాధికారులు ఉపేక్షించారా? లేదా శిక్షిస్తారా? అనేది మిస్టరీగానే ఉంది. ఈ నెల 3న శిశువు మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ అంశంపై ఈ నెల 5న డీఎంహెచ్‌ఓ, ఐసీడీఎస్ పీడీ, జీజీహెచ్ వైద్యుడితో కూడిన త్రిసభ్య కమిటీ విచారణ కొనసాగింది. ఆ శాఖ డైరెక్టర్ వేణుగోపాల్‌రెడ్డి సైతం ఈ నెల 6న శిశుగృహలో విచారణ చేపట్టి ఈ నెల 7 న ఐసీడీఎస్ పీడీ నాగలక్ష్మిని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. శిశువు మృతికి కారణమైన శిశుగృహ సిబ్బందిపై కూడా విచారణ జరుగుతోందని, విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించిన వారిపై చర్యలుంటాయని అందరూ భావించారు. అయితే రోజులు గడుస్తున్న కొద్దీ ఎలాంటి చర్యలు చేపట్టకపోవడంతో ఈ అంశాన్ని అక్కడితో ఉన్నతాధికారులు తొక్కిపెట్టారనే విమర్శలు వినిపిస్తున్నాయి. కాగా, ఇదే అంశంపై ఐసీడీఎస్ ఇన్‌చార్జ్ పీడీ అరుణకుమారి మాట్లాడుతూ.. విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించిన వారందరిపై కలెక్టర్ ఆదేశాల మేరకు చర్యలు తీసుకుంటామన్నారు.
మద్యం తాగేందుకు డబ్బు ఇవ్వలేదని...
రాప్తాడు రూరల్: మద్యం తాగేందుకుని భార్య డబ్బు ఇవ్వకపోవడంతో భర్త అలిగి ఇంట్లో నుంచి వెళ్లిపోయాడు. ఈ ఘటన అనంతపురం రూరల్ మండలం అక్కంపల్లి పంచాయతీ వైఎస్సార్ కాలనీలో చోటు చేసుకుంది. రూరల్ పోలీసులు తెలిపిన మేరకు.. దూదేకుల మహమ్మద్ సెంట్రింగ్ కార్మికుడిగా పని చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఇటీవల మద్యానికి బానిసయ్యాడు. దీంతో మద్యం తాగేందుకు డబ్బు కావాలంటూ తరచూ భార్య బీబీని వేదించేవాడు. ఈ క్రమంలో ఈ నెల 5న మద్యం తాగేందుకు రూ. 500 కావాలని భార్యను అడిగాడు. ఆమె తన వద్ద లేవని తెలపడంతో గొడవపడి అలిగి ఇంట్లో నుంచి వెళ్లిపోయాడు. అప్పటి నుంచి అతని ఆచూకీ లభ్యం కాలేదు. దీంతో భార్య బీబీ బుధవారం చేసిన ఫిర్యాదు మేరకు రూరల్ పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేశారు.