
పీఎం సభకు వస్తారా? లేదా!
అనంతపురం అర్బన్: ‘ఎంకి పెళ్లి సుబ్బి చావుకు వచ్చింది’ అనే చందంగా మారింది జిల్లా అధికారుల పరిస్థితి. కర్నూలు జిల్లాలో గురువారం నిర్వహించనున్న సూపర్ జీఎస్‌టీ– సూపర్ సేవింగ్ కార్యక్రమానికి ప్రధాని నరేంద్రమోదీ హాజరుకానున్న నేపథ్యంలో తన ప్రాబల్యం చూపించుకునేందుకు సీఎం చంద్రబాబు భారీ జనసమీకరణకు అధికారులను పురమాయించారు. ఈ క్రమంలో జిల్లా నుంచి 1,500 మంది వ్యాపారులను సభకు పంపేలా ‘టార్గెట్’ విధించారు. జిల్లాలో ఈ బాధ్యతను తీసుకున్న డీఆర్‌డీఏ, మెప్మా, నగర పాలక సంస్థ, డ్వామా, జిల్లా పంచాయతీ శాఖ అధికారులు వెంటనే రంగంలో దిగి కలెక్టరేట్‌లో ప్రత్యేకంగా 50 మందిని సిబ్బందిని ఏర్పాటు చేసి, 8 వేల మంది వ్యాపారుల ఫోన్ నంబర్ల జాబితాను అందించి, అందరికీ ఫోన్లు చేయించారు. దీంతో కలెక్టరేట్‌లోని ఎన్‌ఐసీ వీసీ హాల్‌తో పాటు ఆరుబయట ప్రాంతంలోనూ ఫోన్ కాల్స్ చేస్తూ సిబ్బంది తలమునకలయ్యారు. కేవలం వ్యాపారుల కోసమే ప్రత్యేకంగా ఒక్కో అర్బన్ మున్సిపాలిటీ నుంచి 100 మంది చొప్పున 500 మందిని, నగర పాలక సంస్థ పరిధి నుంచి 300 మంది, రూరల్ మండలాల నుంచి 700 మంది చొప్పున మొత్తం 1,500 మందిని తరలించేందుకు రంగం సిద్ధం చేశారు. రూరల్ మండలాలకు చెందిన 700 మందికి 14 బస్సులు కేటాయించారు. అలాగే గుంతకల్లు, గుత్తి, తాడిపత్రి, అనంతపురం నగర పాలక సంస్థ నుంచి 800 మందికి 16 బస్సులు ఏర్పాటు చేశారు.
ఉన్నది 511, పంపింది 318
అనంతపురం క్రైం: కర్నూలులో నేడు జరిగే ప్రధాని మోదీ కార్యక్రమానికి బస్సులను ఇష్టారాజ్యంగా పంపడంతో ప్రయాణికులు ఇబ్బంది పడ్డారు. అనంతపురం రీజియన్ పరిధిలో 511 బస్సులుంటే 318 బస్సులను తరలించారు. బస్సులు ఉండవన్న ముందస్తు సమాచారం లేక చాలా మంది గ్రామీణులు నగరంలో ఉండి పోవాల్సి వచ్చింది.
జనసమీకరణలో అధికార యంత్రాంగం
8 వేల మంది వ్యాపారులకు కలెక్టరేట్ నుంచి ఫోన్‌కాల్స్