
ఆశగా తరలివచ్చి.. అర్జీలు అందించి
అనంతపురం అర్బన్: తమ సమస్యలు పరిష్కరించాలని అధికారులకు ప్రజలు విన్నవించుకున్నారు. సోమవారం కలెక్టరేట్‌లోని రెవెన్యూభవన్‌లో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి అర్జీలు పోటెత్తాయి. ప్రజల నుంచి కలెక్టర్ ఓ.ఆనంద్‌తో పాటు డీఆర్‌ఓ ఎ.మలోల, జెడ్పీ సీఈఓ శివశంకర్, డిప్యూటీ కలెక్టర్ ఆనంద్, వ్యవసాయాధికారి ఉమామహేశ్వరమ్మ అర్జీలు స్వీకరించారు. వివిధ సమస్యలపై 422 వినతులు అందాయి. కార్యక్రమం అనంతరం అధికారులతో కలెక్టర్ సమీక్షించారు. పరిష్కార వేదికలో అందే అర్జీల పరిష్కారంలో నిర్లక్ష్యానికి తావివ్వకూడదని ఆదేశించారు. ప్రతి అర్జీని నిశితంగా పరిశీలించి అర్జీదారులతో మాట్లాడి సమస్యను క్షుణ్ణంగా తెలుసుకుని వారు నాణ్యమైన పరిష్కారం చూపాలని చెప్పారు.
వినతుల్లో కొన్ని...
● తనకు తిరిగి ఉద్యోగం ఇప్పించాలని అనంతపురం పాతూరులో నివాసముంటన్న చాంద్‌బాషా విన్నవించాడు. గతంలో కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో కంటింజెట్ ఉద్యోగిగా పనిచేసే వాడినని, ఆరోగ్యం బాగాలేకపోవడంతో ఉద్యోగం చేయలేక పోయానని చెప్పాడు. ప్రస్తుతం ఆరోగ్య బాగుందని, తిరిగి తనకు ఉద్యోగం ఇప్పించాలని కోరాడు.
● మిషన్ వాత్సల్య పథకం కింద తన పిల్లలకు ఆర్థిక సహాయం అందించాలని స్థానిక జనచైతన్య నగర్‌కు చెందిన నీలావతి విన్నవించింది. తన భర్త చనిపోయాడని, కుటుంబపోషణ భారంగా ఉందని వాపోయింది. తనకు ఇద్దరు చిన్నపిల్లలు ఉన్నారని, మిషన్ వాత్సల్య పథకం కింద ప్రతి నెలా ఆర్థిక సహాయం చేయాలని విజ్ఞప్తి చేసింది.
● తమ భూమిని వేరొకరి పేరున ఆన్‌లైన్‌లో నమోదు చేశారని కళ్యాణదుర్గం మండలం మోరేపల్లి గ్రామానికి చెందిన రాము ఫిర్యాదు చేశాడు. సర్వే నంబరు 523లో తమకున్న రెండు ఎకరాలు భైరవానితిప్ప కాలువకు పోయిందని చెప్పాడు. ఆన్‌లైన్‌లో తమ భూమికి సంబంధించి 68 సెంట్లు రమేష్ అనే వ్యక్తి పేరున నమోదైందన్నాడు. ఇందుకు సంబంధించి ఫైలు కలెక్టరేట్‌కు వచ్చినా పరిష్కారం కాలేదని వాపోయాడు. న్యాయం చేయాలని కోరాడు.
● పెద్దమనిషిగా ప్రజల తరఫున మాట్లాడిన తనపై దౌర్జన్యం చేయడమే కాకుండా కూడేరు పోలీసుస్టేషన్‌లో కేసు పెట్టారని కూడేరు మండలం మరుట్ల గ్రామానికి చెందిన గొల్ల చిదంబరప్ప వాపోయాడు. తమ గ్రామంలోని పోస్టాఫీసు భవనం శిథిలావస్థకు చేరుకోవడంతో గ్రామంలో కొందరు జేసీబీతో కూల్చి ఆక్రమించుకున్నాని చెప్పాడు. ప్రజలకు అక్కడ పోస్టాఫీసు కావాలని చెప్పినా వినకుండా తనపై దౌర్జన్యం చేస్తున్నారని తెలిపాడు. పోలీసులు కూడా పట్టించుకోవడం లేదని, దీనిపై న్యాయం చేయాలని కలెక్టర్‌కు విన్నవించాడు.
ప్రజా సమస్యల పరిష్కార వేదికకు పోటెత్తిన అర్జీలు