
నిన్న యూరియా తిప్పలు.. నేడు విత్తన అవస్థలు
అనంతపురం అగ్రికల్చర్: సకాలంలో సరిపడా విత్తనం, ఎరువులు అందించకుండా ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలోని కూటమి సర్కారు రైతులను ఏడిపిస్తోంది. రబీ మొదలై 15 రోజులు కావొస్తున్నా అన్నదాతలకు విత్తన పప్పుశనగ ఇవ్వకుండా దాటవేత ధోరణి అవలంబిస్తోంది. ఈ పాటికే విత్తన పంపిణీ పూర్తి చేయాల్సి ఉన్నా అసలు పంపిణీ ప్రక్రియే ప్రారంభించకపోవడం గమనార్హం. వ్యవసాయ శాస్త్రవేత్తలేమో పంట సాగుకు అసలైన అదను ఈనెల 15న (రేపు) ప్రారంభమవుతుందని, నవంబర్ 15 వరకు విత్తనాలు వేసుకోవచ్చని చెబుతున్నారు. జిల్లాలో 65 వేల హెక్టార్ల భారీ విస్తీర్ణంలో పంట సాగులోకి రావొచ్చని అధికారులు అంచనా వేశారు. కానీ రాయితీ విత్తనం ఎప్పుడిస్తారనే విషయం మాత్రం సర్కారు తేల్చడం లేదు. వ్యవసాయశాఖ, ఏపీ సీడ్స్ నోరు విప్పడం లేదు. దీంతో పప్పుశనగ రైతులు విత్తనం కోసం ఎదురుచూస్తూ అదును మీరుతుందేమోనని ఆందోళన చెందుతున్నారు. రెండు నెలలుగా యూరియా కోసం తిప్పలు పడుతున్న రైతులు నేడు విత్తనం కోసం అవస్థలు పడాల్సిన దుస్థితి నెలకొంది.
ఇదే తొలిసారి..
రాయితీ విత్తనం ఇవ్వకుండా జాప్యం చేస్తుండటం జిల్లా చరిత్రలో ఇదే తొలిసారి కావడం గమనార్హం. రబీ సన్నాహకాలు ఎంత ఆలస్యమైనా అక్టోబర్ 10 లోపు పంపిణీ మొదలు పెడతారు. చంద్రబాబు ప్రభుత్వం మాత్రం 15 రోజుల క్రితమే కేటాయింపులు, ధరలు ప్రకటించినా, వాటికి కూడా కొర్రీలు వేసింది. 28 వేల క్వింటాళ్ల నుంచి 14 వేల క్వింటాళ్లకు కుదించింది. రాయితీ కూడా 40 శాతం నుంచి 25 శాతానికి తగ్గించేసి జిల్లా రైతులపై రూ.కోట్ల మేర భారం మోపింది.
ప్రజాప్రతినిధుల తీరుపై మండిపాటు
రాష్ట్ర కేబినెట్‌లో కీలక మంత్రిగా పయ్యావుల కేశవ్ చెలామణి అవుతున్నారు. 14 మంది ఎమ్మెల్యేలు, ఇరువురు పార్లమెంటు సభ్యులు, ఎమ్మెల్సీలు అధికార పార్టీకి చెందిన వారే అయినా అదునులో విత్తన పప్పుశనగ అందించకపోవడంపై రైతులు మండిపడుతున్నారు. గతంలో ఎన్నడూ ఇలాంటి పరిస్థితి తలెత్తలేదని చెబుతున్నారు. కరోనా లాంటి కష్టకాలంలో కూడా 2020, 2021లో ఖరీఫ్, రబీలో రైతులు ఇబ్బంది పడకుండా సకాలంలో విత్తనాలు, అవసరమైన ఎరువులు సాఫీగా అందించారని గుర్తు చేసుకుంటున్నారు.
రబీ రైతులకు విత్తనం ఇవ్వకుండా కూటమి ప్రభుత్వం దాటవేత
రేపటి నుంచి పంట సాగుకు అదను