
ప్రశ్నిస్తే దాడులు.. మహిళలపై వేధింపులు
● మన్నీలలో అరాచకాలపై పోలీసులకు ఫిర్యాదు చేసిన గ్రామస్తులు
● ప్రాణాలు పోకముందే
స్పందించాలని వేడుకోలు
రాప్తాడురూరల్:అనంతపురం రూరల్ మండలం మన్నీల గ్రామంలో అరాచకాలు సృష్టిస్తున్న కుటుంబాలతో గ్రామస్తులకు ప్రమాదం పొంచి ఉందని పలువురు వాపోయారు. ఈ మేరకు సోమవారం అనంతపురంలో పోలీసు గ్రీవెన్స్‌లో అధికారులను కలిసి విన్నవించారు. సుమారు వందమంది గ్రామస్తులు వినతిపత్రం అందజేశారు.బోయ బాలు, బోయ జయరాం, బోయ ఈశ్వర, బోయ శివ, బోయ బాలచంద్ర, ముష్టూరు బోయ అంజితో పాటు వారి బంధువులతో గ్రామంలో ఏ క్షణమైనా ఎలాంటి ప్రమాదమైనా జరగవచ్చని ఆందోళన వ్యక్తం చేశారు. గ్రామ పొలిమేర దగ్గర ముష్టూరు గ్రామానికి చెందిన దివంగత బోయ కాటమయ్య 100 సంవత్సరాల క్రితం 5 ఎకరాల డీ పట్టా భూమి ఇతరులతో కొనుగోలు చేశాడన్నారు. ఆయన కుమారులు, మనవళ్లు ఇప్పుడు దౌర్జన్యంగా దాదాపు 30 ఎకరాల ప్రభుత్వ భూమిని ఆక్రమించుకున్నారన్నారు. ఎవరైనా నిలదీస్తే దాడులు చేస్తున్నా రన్నారు. తోటల్లో స్టార్టర్ పెట్టెలు, మోటార్లు, డ్రిప్పులు, స్ప్రింక్లర్లను ధ్వంసం చేస్తున్నారన్నారు. వీరి దెబ్బకు భయపడి తోటల వద్ద మహిళలు ఒంటరిగా ఉండలేని పరిస్థితి ఉందన్నారు. ఇటుకలపల్లి, వజ్రకరూరు, బత్తలపల్లి, కూడేరు, ఉరవకొండ, అనంతపురం వన్‌టౌన్, రూరల్ పోలీస్ స్టేషన్లలో వీరిపై కేసులు నమోదయ్యాయన్నారు. ఇటీవల గ్రామంలో ఓ యువతికి పెళ్లి నిశ్చయమైతే పెళ్లి చేసుకునే యువకుడికి ఫోన్ చేసి ఆ అమ్మాయి పట్ల అసభ్యంగా చెప్పడంతో ఆ పెళ్లికాస్తా పెటాకులైందన్నారు. ఈ ఘటనపై గ్రామ ప్రజలందరూ ఇటుకలపల్లి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేస్తే వారంతా ఇంటి మీదకు వచ్చి గొడవ చేయాలని చూశారన్నారు. గతంలో పోలీసులు కందుకూరు గ్రామంలో ఇలానే నిర్లక్ష్యం చేయడంతో ఒక హత్య జరిగిందని, మన్నీల గ్రామ విషయంలోనూ నిర్లక్ష్యం చేస్తే అంతే మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని వాపోయారు. ఇప్పటికైనా స్పందించి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో మాజీ సర్పంచ్ అన్నగిరి ఆదిశేషు, అల్లు షెక్షావలి నాయుడు, అల్లు రామాంజనేయులు, వర్గ ప్రసాద్, రామాంజనేయులు, అన్నగిరి శంకరయ్య, నాగమణి, లక్ష్మీదేవి, నాగలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.