
గుత్తిలో పందుల దొంగల బీభత్సం
● రాళ్లు, మద్యం బాటిళ్లతో దాడి
గుత్తి: స్థానిక తురకపల్లి రోడ్డులో పందుల దొంగలు బీభత్సం సృష్టించారు. ఆదివారం అర్ధరాత్రి, తిరిగి సోమవారం తెల్లవారుజాము నాలుగు గంటల సమయంలో పందుల పెంపకందారులపై రాళ్లు, మద్యం బాటిళ్లతో విరుచుకుపడ్డారు. వివరాల్లోకి వెళితే.. ఆదివారం అర్ధరాత్రి సమయంలో బొలెరో వాహనంలో వచ్చిన పది మంది దుండగులు పందులను ఎత్తుకెళ్లడానికి ప్రయత్నించారు. ఆ సమయంలో అక్కడికి సమీపంలో ఉన్న చేపల వెంకటేష్ గమనించడంతో అతనిపై రాళ్లు, మద్యం బాటిళ్లతో విరుచుకుపడ్డారు. దాడిలో వెంకటేష్‌కు చెందిన రెండు ఐచర్ వాహనాలు దెబ్బతిన్నాయి. దూసుకొస్తున్న రాళ్లు, మద్యం బాటిళ్ల నుంచి తప్పించుకునే క్రమంలో ఐచర్ వాహనాల డ్రైవర్లు, చేపల సిబ్బంది అక్కడి పరుగు తీసి ఓ గదిలో దూరి షట్టర్ వేసుకున్నారు. విషయం తెలుసుకున్న పందుల పెంపకందారులు నారాయణస్వామి, వెంకటరాముడు, శీను, గంగన్న తదితరులు తురకపల్లి రోడ్డులోకి చేరుకోగా మరోసారి వారిపై కూడా రాళ్లు, బాటిళ్లతో దాడికి తెగబడ్డారు. నారాయణస్వామికి తీవ్ర గాయాలయ్యాయి. అయితే పందుల పెంపకందారులు కూడా దీటుగా ఎదుర్కొవడంతో కొన్ని పందులను వదిలి బొలెరో వాహనంలో ఉడాయించారు. ఈ దృశ్యాలన్నీ అక్కడున్న సీసీ కెమెరా ఫుటేజీల్లో నిక్షిప్తమయ్యాయి. ఘటనపై బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఐటీఐలో మిగులు సీట్ల భర్తీకి
దరఖాస్తుల ఆహ్వానం
అనంతపురం సిటీ: జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు పారిశ్రామిక శిక్షణ సంస్థల(ఐటీఐ)లో ఖాళీ సీట్ల భర్తీకి అర్హులైన విద్యార్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. ఈ మేరకు అనంతపురంలోని ప్రభుత్వ ఐటీఐ బాలుర కళాశాల ప్రిన్సిపాల్ రాయపరెడ్డి సోమవారం ఓ ప్రకటన విడుదల చేశారు. ఆసక్తి ఉన్న విద్యార్థులు ఈ నెల 16వ తేదీలోపు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకుని, 16న ఒరిజినల్ సర్టిఫికెట్లను వెరిఫికేషన్ చేయించుకోవాలి. 17న కౌన్సెలింగ్ నిర్వహించి అడ్మిషన్లు కల్పిస్తారు.
విద్యార్థులకు సైన్స్ సెమినార్ పోటీలు
అనంతపురం సిటీ: జాతీయ సైన్స్ సెమినార్–2025ను పురస్కరించుకుని ‘క్వాంటమ్ ఏజ్ బిగిన్స్ – పొటెన్షియల్, ఛాలెంజస్’ అంశంపై జిల్లాలోని ప్రభుత్వ, జిల్లా పరిషత్, మున్సిపల్ ఉన్నత పాఠశాలల్లో చదివే 8 ,9 10 విద్యార్థులకు జిల్లా స్థాయి పోటీలు నిర్వహించనున్నారు. ఈ మేరకు సైన్స్ సెంటర్ జిల్లా అధికారి బాలమురళీకృష్ణ సోమవారం ఓ ప్రకటన విడుదల చేశారు. ఈ నెల 15న పాఠశాల స్థాయిలో పరీక్ష నిర్వహించి ప్రతిభ కనబరిచిన ఇద్దరికి 16న మండల స్థాయిలో పరీక్ష నిర్వహిస్తారు. మండల స్థాయిలో ఎంపికై న ఇద్దరి చొప్పున ఈ నెల 17న అనంతపురంలోని సైన్స్ సెంటర్‌లో ఉదయం 10 గంటలకు సైన్స్ సెమినార్ నిర్వహించనున్నారు. పోటీల్లో పాల్గొనే విద్యార్థులు ఐదు చార్ట్స్, స్లైడ్స్ ఉపయోగిస్తూ గరిష్టంగా ఆరు నిమిషాల పాటు ప్రజంటేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. జిల్లా స్థాయి సెమినార్‌లో ప్రతిభ చాటిన ఇద్దరిని రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపిక చేయనున్నారు.