
ఎస్‌జీఎఫ్ క్రీడా జట్ల ఎంపిక
అనంతపురం కార్పొరేషన్: త్వరలో జరిగే రాష్ట్ర స్థాయి హ్యాండ్‌బాల్, ఖోఖో పోటీల్లో జిల్లా తరఫున ప్రాతినిథ్యం వహించే బాలబాలికల జట్ల ఎంపిక సోమవారం అనంతపురంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో చేపట్టారు. ఉభయ జిల్లాల ఎస్‌జీఎఫ్ కార్యదర్శలు శ్రీనివాసులు, శకుంతల, లక్ష్మీనారాయణ, సుహాసిని హాజరై ప్రతిభ ఆధారంగా క్రీడాకారులను ఎంపిక చేశారు. ఖోఖో బాలికల జట్టుకు స్వప్న, సోనిక, ధానేశ్వరి, అంజలి, లలిత, హరిణి, భవ్యశ్రీ, శ్వేత, పావని, సంధ్య, జయషాలిని, మౌనిక ఎంపికయ్యారు. బాలుర జట్టులో నందకిషోర్, కార్తీక్, అనిల్‌కుమార్, హరికృష్ణ, దేవేంద్ర, నరేంద్ర, చరణ్, సందీప్, పూరణ్‌చంద్ర, గణేష్‌కుమార్, జైకృష్ణ, హర్ష చోటు దక్కించుకున్నారు. అలాగే హ్యాండ్‌బాల్ బాలుర జట్టుకు అభిషేక్, అర్జున్, పవన్‌కుమార్, తరుణ్, పునీత్‌కుమార్, దేవేంద్ర, హిమేష్, శివశంకర్, అభిరాం, సూర్యతేజ, ఉదయ్‌సాయి, జగన్‌మోహన్, లిఖిత్, లోవరాజు, వర్ధన్, జాఫర్ ఎంపికయ్యారు. బాలికల జట్టులో అర్చన, రక్షిత, సుస్మిత, నాగరత్న, గంగమ్మ, హాసిని, లక్ష్మి, గురువర్షిణి, హరిణి, జనప్రియ, నందిని, ఉమ, అక్షయ, రిత్, బృందా, హర్షిత చోటు దక్కించుకున్నారు.
ప్రేమికులు తెచ్చిన తంటా
● పోలీసులపై చర్యలకు రంగం సిద్ధం
అనంతపురం సెంట్రల్: ప్రేమికులకు ఇచ్చిన కౌన్సెలింగ్ పోలీసు సిబ్బంది మెడకు చుట్టుకుంది. పలువురిపై చర్యలకు రంగం సిద్ధమవుతోంది. అయితే ఈ విషయంపై మాట్లాడేందుకు పోలీసు అధికారులు నిరాకరించారు. విశ్వసనీయ సమాచారం మేరకు... గార్లదిన్నె మండలంలో ఓ గ్రామానికి చెందిన 22 సంవత్సరాల యవతి, 16 సంవత్సరాల బాలుడు ప్రేమించుకుని ఇంటి నుంచి పారిపోయారు. అనంతపురం నాల్గో పట్టణ పీఎస్ పరిధిలో ఉన్నట్లు గుర్తించిన వారి కుటుంబసభ్యుల ఫిర్యాదుతో రెండు రోజుల క్రితం వారిని పోలీసులు అదుపులోకి తీసుకుని స్టేషన్‌లో మోకాళ్లపై నిలబెట్టి తీవ్రస్థాయిలో మందలించారు. ఈ విషయం కాస్త సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో పోలీసు ఉన్నతాధికారులు స్పందించారు. వారి ఆదేశాల మేరకు అనంతపురం డీఎస్పీ శ్రీనివాసరావు.. ఆ రోజు ఏం జరిగిందనే అంశంపై సీసీ కెమెరా ఫుటేజీలను పరిశీలించారు. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించినట్లు నిర్ధారించినట్లు తెలుస్తోంది. దీంతో ఆ సమయంలో విధుల్లో ఉన్న పోలీసులపై చర్యలు తీసుకోనున్నట్లు సమాచారం. ఇందులో ఓ మహిళా కానిస్టేబుల్ కూడా ఉన్నట్లు తెలిసింది. ఈ విషయంపై నాల్గవ పట్టణ సీఐ జగదీష్‌ను వివరణ కోరగా... ప్రేమ జంటను మోకాళ్లపై నిలబెట్టలేదని, మంచిగా జీవించాలని కౌన్సెలింగ్ చేసినట్లు వివరించారు.