
గుట్టను కరిగిస్తున్న ‘తమ్ముళ్లు’
రాప్తాడు: మండలంలోని గొందిరెడ్డిపల్లి గుట్టను టీడీపీ నాయకులు కరిగిస్తున్నారు. ఈ గుట్ట రాప్తాడు సమీపంలో 44వ జాతీయ రహదారికి దగ్గర్లోనే ఉంది. మొన్నటి వరకు గుట్టకు తూర్పు వైపున అక్రమంగా మట్టిని తవ్వేసిన ‘తమ్ముళ్లు’.. ఇప్పుడు కొండ చుట్టూ రాత్రి, పగలు తేడా లేకుండా కొల్లగొడుతున్నారు. గుట్ట తవ్వుకునేందుకు లీజుదారులు అభ్యంతరం తెలిపినా వారు వినడం లేదు. గొందిరెడ్డిపల్లి, ఎం.బండమీదపల్లి, రాప్తాడుకు చెందిన నలుగురు ‘తెలుగు తమ్ముళ్లు’ కలసికట్టుగా దోపిడీకి తెరలేపారు. వీరికి సొంతంగా టిప్పర్లు, జేసీబీలు, హిటాచీ వాహనం ఉన్నాయి. వీటి సాయంతో నిత్యం మట్టి తవ్వకాలు చేపడుతూ నగరానికి తరలిస్తున్నారు. రోజూ 100 నుంచి 150 ట్రిప్పుల మట్టి రవాణా చేస్తున్నారు. ఖర్చులన్నీ పోను రోజూ రూ.2 లక్షలకు పైగా ఆదాయం పొందుతున్నట్లు తెలుస్తోంది. గతంలో ఆర్థికంగా అంతంత మాత్రంగానే ఉన్న ఈ నాయకులు కూటమి ప్రభుత్వం వచ్చాక గొందిరెడ్డిపల్లి కొండ పుణ్యమా అని రూ.కోట్లకు పడగలెత్తారు. వీరి అక్రమ దందాకు కొందరు అధికారులు కూడా సహకరిస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. వారికి నెలవారీ మూమూళ్లు ఇస్తున్నట్లు ప్రచారం సాగుతోంది. ఈ కారణంగానే పోలీసులు, ఆర్టీఏ, భూగర్భ గనుల శాఖ విజిలెన్స్ అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది. దీనికితోడు పొరపాటున ఎవరైనా వీరి వాహనాలను ఆపితే వెంటనే కొందరితో ఫోన్లు చేయిస్తున్నారు. తరచూ రాప్తాడు నియోజకవర్గానికి చెందిన ఓ ముఖ్య ప్రజాప్రతినిధి పేరు చెబుతూ మట్టి దందాను నిరాటంకంగా కొనసాగిస్తున్నారు.
ప్రజాప్రతినిధి పేరు చెప్పుకుంటూ
నిరాటంకంగా మట్టిదోపిడీ