
ఏఎస్పీ కార్యాలయానికి బందోబస్తు
తాడిపత్రిటౌన్: తాడిపత్రి పట్టణంలోని ఏఎస్పీ కార్యాలయం వద్ద బుధవారం వందలాది మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. గత నెల 31న పట్టణంలో నిర్వహించిన వినాయక విగ్రహాల శోభాయాత్రలో టీడీపీ నాయకులు జేసీ ప్రభాకర్‌రెడ్డి, కాకర్ల రంగనాథ్ వర్గాలు రాళ్లు రువ్వుకున్న ఘటనలో ఇరు వర్గాలకు చెందిన నలుగురిని పోలీసులు అదుపులోకి తీసుకొని అనంతపురం తరలించారు. విషయం తెలుసుకున్న జేసీ ప్రభాకర్‌రెడ్డి పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున తన ఇంటి వద్దకు రావాలని వాట్సాప్ గ్రూప్‌లో మెసేజ్ పెట్టడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఏఎస్పీ కార్యాలయం వద్ద ఆందోళనకు సిద్ధమవుతున్నట్లు సమాచారం రావడంతో బలగాలతో బందోబస్తు ఏర్పాటు చేశారు. అయితే, అనివార్య కారణాలతో ఆందోళన కార్యక్రమం వాయిదా పడిందని జేసీ వర్గీయులు చెప్పడం గమనార్హం. ఒక్కసారిగా ఏఎస్పీ కార్యాలయం వద్దకు పెద్ద సంఖ్యలో పోలీసులు చేరుకోవడంతో తాడిపత్రి పట్టణ ప్రజలు ఉలిక్కిపడ్డారు.
22 మండలాల్లో వర్షం
అనంతపురం అగ్రికల్చర్: జిల్లా వ్యాప్తంగా తేలికపాటి వర్షాలు కొనసాగుతున్నాయి. మంగళవారం రాత్రి నుంచి బుధవారం ఉదయం వరకు 22 మండలాల పరిధిలో 4.9 మి.మీ సగటు వర్షపాతం నమోదైంది. కళ్యాణదుర్గం 17.2 మి.మీ, కంబదూరు 15.4, నార్పల 11.6, విడపనకల్లు 11.2, ఉరవకొండ 10.6, కుందుర్పి 10.2 మి.మీ వర్షపాతం నమోదైంది. మిగతా మండలాల్లో తేలికపాటి వర్షం పడింది. సెప్టెంబర్ సాధారణ వర్షపాతం 110.9 మి.మీ కాగా ప్రస్తుతానికి 12.9 మి.మీ నమోదైంది. ఓవరాల్‌గా జూన్ ఒకటి నుంచి ఇప్పటి వరకు 218 మి.మీ గానూ 20 శాతం అధికంగా 261.4 మి.మీ నమోదైంది. 21 వర్షపు రోజులు (రెయినీడేస్) నమోదు కాగా... 17 మండలాల్లో సాధారణం కన్నా అధికంగా, 10 మండలాల్లో సాధారణం, మిగతా 4 మండలాల్లో తక్కువగా వర్షపాతం నమోదైంది.
సీఎం పర్యటన ఏర్పాట్లు పటిష్టంగా ఉండాలి
● అధికారులకు కలెక్టర్ వినోద్‌కుమార్ ఆదేశం
అనంతపురం అర్బన్: ముఖ్యమంత్రి చంద్రబాబు ఈనెల 10న జిల్లాలో పర్యటించనున్న నేపథ్యంలో ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు పటిష్టంగా ఉండాలని కలెక్టర్ వి.వినోద్‌కుమార్ సంబంధిత అధికారులను ఆదేశించారు. స్థానిక శ్రీనగర్ కాలనీలో ఉన్న జీఎంఆర్ గ్రౌండ్స్‌లో జరుగుతున్న ఏర్పాట్లను సీఎం ప్రోగ్రాం కో– ఆర్డినేటర్ మంతెన సత్యనారాయణరాజు, ఎస్పీ పి.జగదీష్‌తో కలిసి కలెక్టర్ బుధవారం పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ హెలీప్యాడ్, సభాస్థలి, పార్కింగ్, తదితర ఏర్పాట్లు పకడ్బందీగా ఉండాలన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్, జాయింట్ కలెక్టర్ శివ్ నారాయణ్ శర్మ, కార్మిక సంక్షేమ బోర్డు చైర్మన్ వెంకటశివుడు యాదవ్, ఆర్డీఓ కేశవనాయుడు పాల్గొన్నారు.
ఆ ఉద్యోగిపై సస్పెన్షన్ వేటు
రాయదుర్గం: తప్పతాగి విధులకు హాజరైన ఉద్యోగిని ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. వివరాలు.. రాయదుర్గం ఏరియా ఆస్పత్రిలో కాంట్రాక్ట్ ప్రాతిపదికన రేడియోగ్రాఫర్‌గా విధులు నిర్వర్తిస్తున్న మదన్‌కుమార్ మంగళవారం పూటుగా మద్యం సేవించి ఆస్పత్రికి వచ్చాడు. ఇష్టారాజ్యంగా ప్రవర్తించాడు. మదన్‌కుమార్ వ్యవహారంపై కలెక్టర్ వినోద్‌కుమార్ తీవ్రంగా స్పందించారు. ఆయన ఆదేశాల మేరకు డీసీహెచ్‌ఎస్ బుధవారం రాయదుర్గం ఏరియా ఆస్పత్రిని సందర్శించారు. సూపరింటెండెంట్ మెర్జీ జ్ఞానసుధతో మాట్లాడారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ.. రేడియోగ్రాఫర్ తీరుపై కలెక్టర్ సీరియస్ అయ్యారన్నారు. సస్పెండ్ చేసి విచారణ చేయాలని ఆదేశించారన్నారు. వ్యక్తిగత సమస్యలతో మద్యం సేవించాల్సి వచ్చిందని సదరు రేడియోగ్రాఫర్ చెప్పాడన్నారు. ఈ విషయంపై నివేదికను కలెక్టర్, వైద్యశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీకి పంపుతామని చెప్పారు. కార్యక్రమంలో సీనియర్ వైద్యులు మహేష్‌కుమార్ పాల్గొన్నారు.

ఏఎస్పీ కార్యాలయానికి బందోబస్తు