
అధినేతకు కృతజ్ఞతలు తెలిపిన ఆలూరు
శింగనమల: వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని మంగళవారం తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ఆలూరు సాంబశివారెడ్డి కలిశారు. తనకు వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నియమించినందుకు కృతజ్ఞతలు తెలిపారు.
మూడు రోజుల శిక్షణకు జేసీ
అనంతపురం అర్బన్: ప్రాజెక్టులకు భూ సేకరణ అంశంపై మూడు రోజుల ఇన్‌సర్వీస్ శిక్షణకు జాయింట్ కలెక్టర్ శివ్ నారాయణ శర్మ ముస్సోరి తరలి వెళ్లారు. ఈ నెల 16 నుంచి 18వ తేదీ వరకూ శిక్షణలో పాల్గొననున్నారు. తిరిగి ఈనెల 19న విధులకు హాజరు కానున్నారు.
భోజనం ప్లేటు కోసం గొడవ
గుంతకల్లుటౌన్: పట్టణంలోని ఎస్‌జేపీ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో మంగళవారం మధ్యాహ్న భోజన వేళ ప్లేటు కోసం ఇద్దరు విద్యార్థుల మధ్య గొడవ జరిగింది. పదో తరగతి విద్యార్థి బి.రామన్న ఎడమ చేతికి తీవ్ర గాయమైంది. పదో తరగతి చదువుతున్న రామన్న, రిహాన్ భోజనం ప్లేటు తనదంటే తనదంటూ లాక్కునే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో అప్పటికే డ్యామేజీ అయిన పదునైన ప్లేటు రామన్న ఎడమ చేతికి బలంగా తగిలింది. తీవ్ర గాయం కావడంతో ఆ విద్యార్థిని ఉపాధ్యాయులు స్థానిక ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లి వైద్యం చేయించారు. సుమారు 12 కుట్లు పడ్డాయి. మధ్యాహ్న భోజన వేళ ఉపాధ్యాయుల పర్యవేక్షణ ఉన్నట్లయితే ఈ ఘటన జరిగేది కాదని, భవిష్యత్తులో ఇలాంటివి పునరావృతం కాకుండా జాగ్రత్తలు పాటించాలని డీవైఎఫ్‌ఐ పట్టణ కార్యదర్శి సురేంద్ర కోరారు.
ఖతార్‌లో వెల్డర్‌గా ఉద్యోగావకాశం
అనంతపురం: ఖతార్ దేశంలో వెల్డర్ ఉద్యోగావకాశాలు కల్పిస్తున్నట్లు జిల్లా నైపుణ్యాభివృద్ధికారి పీవీ ప్రతాప రెడ్డి తెలిపారు. ఈ మేరకు మంగళవారం ఓ ప్రకటన విడుదల చేశారు. 24 నుంచి 45 సంవత్సరాల మధ్య వయస్సు, ఐటీఐ లేదా ఐటీసీ విద్యార్హత కలిగి నాలుగేళ్ల అనుభవమున్న వారు అర్హులు. టిగ్/ఏఆర్‌సీ మల్టీ వెల్డర్ ఉద్యోగానికి నెలకు రూ.52 వేల నుంచి రూ.61,500, టిగ్/ఏఆర్‌సీ వెల్డర్ ఉద్యోగానికి నెలకు రూ.42,500 నుంచి రూ.52 వేలు జీతం చెల్లిస్తారు. రెండేళ్ల కాంట్రాక్ట్ పరిధిలో ఉచిత వసతి, భోజనం, వైద్యం, రవాణా, స్వదేశానికి ఒకసారి టికెట్ సదుపాయం కల్పిస్తారు. ఆసక్తి ఉన్న వారు ఈ నెల 31లోపు దరఖాస్తు చేసుకోవాలి. పూర్తి వివరాలకు 95502 15161, 91609 12690, 99888 53335లో సంప్రదించవచ్చు.
బీటెక్ ఫలితాల విడుదల
అనంతపురం: జేఎన్‌టీయూ (ఏ) పరిధిలో జూన్‌లో నిర్వహించిన బీటెక్ ఒకటో సంవత్సరం రెండో సెమిస్టర్ (ఆర్–23) రెగ్యులర్, (ఆర్–20), (ఆర్–19), (ఆర్–15) సప్లిమెంటరీ ఫలితాలు, ఒకటో సంవత్సరం మొదటి సెమిస్టర్ (ఆర్–23), (ఆర్–20), (ఆర్–19), (ఆర్–15) సప్లిమెంటరీ ఫలితాలను డైరెక్టర్ ఆఫ్ ఎవాల్యుయేషన్స్ ప్రొఫెసర్ వి. నాగప్రసాద్‌నాయుడు మంగళవారం విడుదల చేశారు. ఫలితాలను జేఎన్‌టీయూ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచినట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ ఏపీ శివకుమార్, అడిషనల్ కంట్రోలర్స్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ జి.రాజు, డాక్టర్ శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.

అధినేతకు కృతజ్ఞతలు తెలిపిన ఆలూరు