
రైల్వే ఇన్‌స్టిట్యూట్ ఎన్నికల్లో ‘మజ్దూర్’ ప్యానెల్
గుత్తి: రైల్వే ఇన్‌స్టిట్యూట్ కార్యవర్గ ఎన్నికల్లో దక్షిణ మధ్య రైల్వే మజ్దూర్ యూనియన్ ప్యానెల్‌లోని 9 మంది ఘన విజయం సాధించారు. గుత్తి ఆర్‌ఎస్‌లోని రైల్వే ఇన్‌స్టిట్యూట్ కార్యవర్గం ఎన్నికలు మంగళవారం జరిగాయి. దక్షిణ మధ్య రైల్వే మజ్దూర్ యూనియన్, ఎంప్లాయీస్ సంఘ్ తరపున అభ్యర్థులు బరిలో నిలిచారు. సెక్రటరీ, జాయింట్ సెక్రటరీ, కోశాధికారి, ఆరుగురు డైరెక్టర్ల పదవులకు నిర్వహించిన ఈ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. ఉదయం 8 నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరిగింది. మొత్తం 790 మంది ఓటర్లు ఉండగా 747 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. సాయంత్రం 5 నుంచి ఏడు గంటల వరకు కౌటింగ్ ప్రక్రియ చేపట్టారు. ఎంప్లాయీస్ సంఘ్ అభ్యర్థులు 9 మంది పోటీ చేసినా ఒక్కరూ గెలవలేకపోయారు. దక్షిణ మధ్య రైల్వే మజ్దూర్ యూనియన్ ప్యానెల్ తరపున సెక్రెటరీగా నయబ్ రసూల్ తన ప్రత్యర్థి వేణుగోపాల్‌పై 128 ఓట్ల మెజార్టీతో గెలిచారు. జాయింట్ సెక్రెటరీగా ఎన్.విజయకుమార్ 150 ఓట్ల మెజార్టీ, కోశాధికారిగా పోటీ చేసిన కేఎస్ కృష్ణ 148 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. డైరెక్టర్లుగా పోటీ చేసిన టి.కంబయ్య, పి.వెంకటేష్, టి.రామాంజనేయులు, పి.సుంకన్న, జ్ఞాన్‌సింగ్ మీనా, ఎం.బాలకృష్ణ ఘన విజయం సాధించారు. ఎన్నికల అధికారిగా ఏడీఎంఈ నేత చంద్ర వ్యవహరించారు.

రైల్వే ఇన్‌స్టిట్యూట్ ఎన్నికల్లో ‘మజ్దూర్’ ప్యానెల్