
జేఎన్‌టీయూలో కొత్త కోర్సు
అనంతపురం: జేఎన్‌టీయూ (ఏ) క్యాంపస్ ఇంజినీరింగ్ కళాశాలలో కొత్త కోర్సు అమలు చేస్తున్నట్లు వీసీ హెచ్.సుదర్శనరావు సోమవారం వెల్లడించారు. వర్సిటీ పరిధిలోని అన్ని అనుబంధ ఇంజినీరింగ్ కళాశాలలకు త్వరలో అటానమస్ హోదా దక్కనున్న నేపథ్యంలో క్యాంపస్ ఇంజినీరింగ్ కళాశాలలో విద్యార్థుల సంఖ్యను పెంచుకోవాల్సిన అనివార్య పరిస్థితి నెలకొంది. అయితే కొత్త కోర్సులను ప్రవేశపెట్టడంలో జాప్యం నెలకొని పేద, మధ్య తరగతి విద్యార్థులు క్యాంపస్‌లో చదివే అవకాశం లేకుండా పోతోంది. ఈ అంశంపై ‘విశ్వ ఖ్యాతి.. అధోగతి’ శీర్షికన సోమవారం ‘సాక్షి’లో వెలువడిన కథనంపై వీసీ స్పందించారు. ఉన్నత విద్యామండలితో ఫోన్‌లో సంప్రదించి కొత్త కోర్సు అమలుకు చర్యలు తీసుకున్నారు. ఏపీ ఈఏపీసెట్ –2025 వెబ్ ఆప్షన్లలో ఈ కొత్త కోర్సును ఎంపిక చేసుకునే వెసులుబాటును అందుబాటులోకి తెచ్చారు.
కొత్త కోర్సు వివరాలు ఇలా:
జేఎన్‌టీయూ (ఏ) క్యాంపస్ ఇంజినీరింగ్ కళాశాలలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లర్నింగ్ అనే కొత్త కోర్సును సెల్ఫ్ ఫైనాన్స్ కింద ప్రవేశపెట్టారు. కన్వీనర్ కోటాలో 66 సీట్లను కేటాయించారు. కోర్సు ఫీజు రూ.75 వేలుగా నిర్ధారించారు. వీటికి ఫీజు రీయింబర్స్‌మెంట్ వర్తిస్తుంది.
● కంప్యూటర్ సైన్సెస్‌లో ప్రస్తుతమున్న సీట్లకు అదనంగా 66 సీట్లు కొత్తగా కేటాయించారు. ఒక్కో సీటుకు రూ.1.50 లక్షలుగా నిర్ధారించారు. సెల్ఫ్ సపోర్టింగ్ కేటగిరిలో ఈ సీట్లు కేటాయిస్తారు. వీటికి ఫీజు రీయింబర్స్‌మెంట్ వర్తించదు.
● ఈసీఈలో ఇప్పుడు ఉన్న సీట్లకు అదనంగా 66 సీట్లు కేటాయించారు. ఒక్కో సీటుకు కోర్సు ఫీజు రూ.1.25 లక్షలుగా నిర్ధేశించారు. వీటికి ఫీజు రీయింబర్స్‌మెంట్ వర్తించదు. ఈ కోర్సులన్నింటినీ 2025–26 విద్యా సంవత్సరంలో అమల్లోకి తెచ్చారు. బీటెక్ మొదటి సంవత్సరం విద్యార్థులకు వర్తిస్తుంది.