
ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారు
అనంతపురం కార్పొరేషన్: జిల్లాలో ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసేలా పోలీసు శాఖ వ్యవహరిస్తోందని, ప్రజాస్వామ్య విలువలను కాపాడాల్సిన పోలీసులే ఈ విధంగా ఆంక్షలు విధించడం సరికాదని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి మండిపడ్డారు. మంగళవారం తాడిపత్రిలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ స్థాయి సమావేశం నిర్వహించబోతున్న తరుణంలో.. సమావేశాన్ని వాయిదా వేసుకోవాలంటూ పార్టీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డికి తాడిపత్రి ఏఎస్పీ రోహిత్ కుమార్ చౌదరి నోటీసు జారీ చేశారు. సోమవారం రాత్రి తాడిపత్రి సీఐ సాయిప్రసాద్, అనంతపురం టూటౌన్ సీఐ శ్రీకాంత్ యాదవ్ ఏఎస్పీ ఇచ్చిన నోటీసును ‘అనంత’కు ఆయన నివాసంలో అందజేశారు. దీనిపై ‘అనంత’ లిఖిత పూర్వకంగా ఏఎస్పీకి లేఖ పంపారు.
అందులో ఏమన్నారంటే..
‘వైఎస్సార్‌సీపీ అధిష్టానం పిలుపు మేరకు రీకాలింగ్ చంద్రబాబు మేనిఫెస్టో కార్యక్రమంలో భాగంగా తాడిపత్రిలోని పాత వైఎస్సార్ సీపీ కార్యాలయం వద్ద మంగళవారం ఉదయం 10 గంటలకు నియోజకవర్గ స్థాయి సమావేశాన్ని నిర్వహించాలని నిర్ణయించాం. ఈ విషయాన్ని పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులకు తెలియజేశాం. సమావేశానికి ముఖ్యఅతిథులుగా అనంతపురం పార్లమెంట్ పరిశీలకుడు నరేష్‌రెడ్డి, నేను హాజరుకానున్నాం. ఈ సమావేశాన్ని మూడు రోజుల పాటు వాయిదా వేయాలని మీరు సూచించారు. మీరు పేర్కొన్నదాని ప్రకారం ఇదే రోజు వీరాపురం గ్రామంలో నూతన పవర్ సబ్ స్టేషన్ ప్రారంభోత్సవం ఉండబోతోంది. ఆ కార్యక్రమానికి మంత్రులు కేశవ్, టీజీ భరత్, గొట్టిపాటి రవికుమార్, ప్రభుత్వ విప్ కాలవ శ్రీనివాసులు, తాడిపత్రి ఎమ్మెల్యే తదితరులు హాజరుకానున్నారు. గతంలో కూడా తాడిపత్రి నియోజకవర్గ సమన్వయకర్త పలుమార్లు అనుమతి కోరిన సందర్భాల్లో, మీ కార్యాలయం తరచూ వాయిదా వేయాలని రాతపూర్వకంగా సమాధానం ఇచ్చిన దాఖలాలు ఉన్నాయి. ప్రస్తుతం నేను పార్టీ జిల్లా అధ్యక్షుడిగా అనుమతి కోరిన విషయంపై కూడా అదే తరహాలో స్పందించారు. మేము నిర్వహించబోయే కార్యక్రమం హాలులో జరగబోయే ఇండోర్ సమావేశమే. ఇది ఎట్టి పరిస్థితుల్లో బహిరంగ సభ కాదు. ఈ తరహా కార్యక్రమాలకు కూడా అనుమతి నిరాకరించడం, రాజకీయ పార్టీలకు వారి హక్కులు ఉండనివ్వకపోవడం, ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడమే. ఇలాంటి చర్యలతో తాడిపత్రిని ఒక ప్రత్యేకమైన ప్రాంతంగా భావించి ప్రతిపక్ష పార్టీలకు అనుమతులు తిరస్కరిస్తున్నారన్న అనుమానం మాకు కలుగుతోంది. మేము నిర్వహించే కార్యక్రమం హాలులో, శాంతియుతంగా, ప్రజాస్వామ్యబద్ధంగా జరుగుతుందని మేము హామీ ఇస్తున్నాం. మా కార్యక్రమానికి అనుమతిచ్చి ప్రజాస్వామ్య విలువలను కాపాడాలి’ అని ‘అనంత’ లేఖలో పేర్కొన్నారు.
పోలీసుల తీరుపై వైఎస్సార్ సీపీ
జిల్లా అధ్యక్షుడు అనంత ధ్వజం
తాడిపత్రి సమావేశానికి వెళ్లొద్దంటూ నోటీసులివ్వడంపై మండిపాటు