
పి.నారాయణపురానికి జాతీయ స్థాయి గుర్తింపు
కూడేరు: మండలంలోని పి.నారాయణపురం గ్రామ పంచాయతీకి జాతీయ స్థాయి గుర్తింపు దక్కింది. జాతీయ స్థాయిలో నిర్వహించిన పోటీల్లో ఆ గ్రామ సర్పంచ్ హనుమంతరెడ్డి ద్వితీయ స్థానంలో విజేతగా నిలిచి, రూ.25 వేల పారితోషికాన్ని గెలుచుకున్నారు. వివరాల్లోకి వెళితే... సర్పంచ్ సంవాద్ పేరిట భారత నాణ్యత మండలి సర్పంచులందరినీ ఒకే వేదిక పైకి తీసుకు వచ్చేందుకు ప్రత్యేకంగా యాప్‌ను తీసుకొచ్చింది. గ్రామ పంచాయతీలు అభివృద్ధి చెందాలంటే ఏమి చేస్తే బాగుంటుంది. అనుసరించాల్సిన విధానాలను వీడియో తీసి యాప్‌లో అప్‌లోడ్ చేయాలని కేంద్రం సూచించింది. ఈ ఏడాది జూన్‌లో సర్పంచ్ హనుమంతరెడ్డి ఓ వీడియో సందేశాన్ని పంపి తన ఆలోచనా విధానాన్ని పంచుకున్నారు. అధికారులను సమన్వయం చేసుకుని గ్రామంలో ఇంటింటికి స్వచ్ఛమైన నీరందించడం, బాధ్యతగా చెత్త సేకరణ, అందులో నుంచి తడి పొడి చెత్తను వేరు చేయడం, తద్వారా వర్మీ కంపోస్టు ఎరువు చేసి సంపద సృష్టించే అంశాలను వివరించారు. ఈ వీడియోను పరిశీలించిన భారత నాణ్యత మండలి... సర్పంచ్ ఆలోచన తీరును మెచ్చుకుంది. జాతీయ స్థాయిలో సర్పంచ్ హనుమంతరెడ్డిని రెండవ విజేతగా ప్రకటించింది. ఈ విషయాన్ని ఆయన ఆదివారం ‘సాక్షి’కి వెల్లడించారు. మారుమూల పంచాయతీకి జాతీయ స్థాయిలో గుర్తింపు రావడం తనకెంతో ఆనందంగా ఉందని ఆయన పేర్కొన్నారు.