
ఇంటికి వస్తూ.. తిరిగిరాని లోకాలకు..
బుక్కరాయసముద్రం: కుమారుడిని ఉన్నత స్థానంలో చూడాలని ఆ తల్లిదండ్రులు కలగన్నారు. అందుకే పెద్ద చదువులు చదివించారు. మంచి ఉద్యోగం సాధించేలా కుమారుడి వెన్నంటే ఉండి ప్రొత్సహించారు. అతనూ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ కావడంతో వారి ఆనందానికి హద్దుల్లేకుండా పోయాయి. అయితే దేవుడు చిన్నచూపు చూడటంతో వారి సంతోషం ఎక్కువ రోజులు నిలబడలేదు. రోడ్డు ప్రమాదంలో కుమారుడు తిరిగిరాని లోకాలకు వెళ్లిపోవడంతో వారు కన్నీరు మున్నీరవుతున్నారు. వివరాల్లోకెళితే.. చలపతి, జయమ్మ తాడిపత్రి పట్టణంలో నివాసం ఉంటున్నారు. చలపతి ఓ గ్రానైట్ షాపులో రైటర్‌గా పని చేస్తున్నాడు. వీరికి కుమారుడు, కుమార్తె ఉన్నారు. కుమార్తెకు పెళ్లి చేశారు. కుమారుడు కడవ బాలాజీ (26) బెంగళూరులోని టెక్ మహేంద్రలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్నాడు. 15 రోజులు ఆఫీసులో.. 15 రోజులు వర్క్‌ఫం హోం చేసేవాడు. ఇందులో భాగంగా శనివారం తెల్లవారు జామున బెంగళూరు నుంచి రాయల్ ఎన్‌ఫీల్డ్ (బుల్లెట్) బైక్‌పై ఇంటికి బయలు దేరాడు. అయితే బుక్కరాయసముద్రం మండల పరిధిలోని రెడ్డిపల్లి గ్రామంలో అనంతపురం – తాడిపత్రి జాతీయ రహదారిపై కుక్క అడ్డువచ్చింది. దాన్ని తప్పించే క్రమంలో ద్విచక్ర వాహనం అదుపు తప్పడంతో బాలాజీ తలకు బలమైన గాయం తగిలి అక్కడికక్కడే మృతి చెందాడు. తలకు హెల్మెట్ ఉన్నా ప్రాణాలను కాపాడలేక పోయింది. విషయం తెలుసుకున్న తండ్రి చలపతి సంఘటనా స్థలానికి చేరుకొని కన్నీరు మున్నీరుగా విలపించారు. కుమారుడికి పెళ్లి సంబంధాలు చూస్తున్నామని, ఇంకా కొన్ని రోజులు ఆగండి నాన్నా... మంచి జీతం వస్తుందని చెప్పేవాడని , ఏదీ జరగకుండానే అప్పుడే నూరేళ్లు నిండాయా అని రోధించడం పలువురిని కంటతడి పెట్టించింది. సీఐ పుల్లయ్య ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
రోడ్డు ప్రమాదంలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ మృతి
కన్నీరుమున్నీరైన కుటుంబ సభ్యులు

ఇంటికి వస్తూ.. తిరిగిరాని లోకాలకు..