
రైతు ఆత్మహత్యాయత్నం
గుత్తి రూరల్: మండలంలోని వన్నేదొడ్డికి చెందిన గొల్ల వెంకటనారాయణ శనివారం పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. పోలీసుల వివరాలమేరకు.. వన్నేదొడ్డికి చెందిన వెంకటనారాయణ కొన్ని నెలలుగా కుటుంబ సమస్యలతో బాధపడుతున్నాడు. ఈ నేపథ్యంలో తీవ్ర మనోవేదనకు గురైన వెంకటనారాయణ గ్రామ శివారులోని తన వ్యవసాయ పొలం వద్దకు వెళ్లి వేరుశనగ పంటలకు పిచికారీ చేసే పురుగుల మందు సేవించి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. పక్క పొలాల రైతులు గమనించి కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. పొలంలో అపస్మారకస్థితిలో పడి ఉన్న వెంకటనారాయణను వెంటనే చికిత్స నిమిత్తం గుత్తి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అనంతరం వైద్యుల సూచన మేరకు మెరుగైన చికిత్సలకు అనంతపురంకు తరలించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
అప్పులబాధ తాళలేక మరొకరు..
గుత్తి రూరల్: కర్నూలు జిల్లా తుగ్గలి మండలం మిద్దె తండాకు చెందిన సోమ్లానాయక్ అనే రైతు అప్పుల బాధ తాళలేక శనివారం ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. పోలీసుల వివరాలమేరకు.. సోమ్లా నాయక్ పంటల సాగుతో పాటుగా కుటుంబ పోషణకు అప్పులు చేశాడు. తీవ్ర వర్షాభావ పరిస్థితుల కారణంగా పంటలు పండక పోవడంతో తీవ్రంగా నష్టపోయాడు. అక్రమంలో అప్పులు ఇచ్చిన వారు చెల్లించాలని ఒత్తిడి అధికమైంది. దీంతో తీవ్ర మనస్తాపం చెందిన సోమ్లానాయక్ ఇంట్లో ఎవరూ లేని సమయంలో పురుగుల మందు సేవించి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. పురుగుల మందు డబ్బాతో అపస్మారక స్థితిలో పడి ఉన్న సోమ్లానాయక్‌ను గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే చికిత్స నిమిత్తం గుత్తి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో వైద్యుల సూచన మేరకు మెరుగైన చికిత్సలకు కర్నూలుకు తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

రైతు ఆత్మహత్యాయత్నం