
మార్గదర్శకులను గుర్తించాలి
అనంతపురం అర్బన్: పేదరిక నిర్మూలన కోసం పీ4 కార్యక్రమం కింద మార్గదర్శకులను గుర్తించాలని కలెక్టర్ వినోద్‌కుమార్ అధికారులను ఆదేశించారు. కలెక్టర్ శుక్రవారం క్యాంపు కార్యాలయం నుంచి జీరో పావర్టీ పీ4 కార్యక్రమంపై అన్ని శాఖల జిల్లా, డివిజన్, నియోజకవర్గ, మండలస్థాయి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. కలెక్టర్ మాట్లాడుతూ పీ4 కార్యక్రమం కింద జిల్లాలో 68,316 బంగారు కుటుంబాలను గుర్తించామన్నారు. వారి భవితకు భరోసా కల్పించేందుకు దాతలను (మార్గదర్శకులు) గుర్తించాలని చెప్పారు. ఇప్పటి వరకు 20 మంది మార్గదర్శకులు లాగిన్ అయి రిజిస్ట్రేషన్ చేసుకున్నారన్నారు. వారు 813 మందిని దత్తత తీసుకున్నారన్నారు. మార్గదర్శకుల గుర్తింపునకు అన్ని శాఖల అధికారులు తమ పరిధిలోని పరిశ్రమల యాజమానులు, పాఠశాలలో చదివి ఉన్నతస్థాయిలో ఉన్నవారిని, ఎన్‌ఆర్‌ఐ, ఎన్‌ఆర్‌ఈలు, బడా వ్యాపారులు, తదితర సంస్థలు, సంఘాలతో ఈ నెల 15లోగా సమావేశం నిర్వహించాలన్నారు.
అధికారులు దత్తత తీసుకోవాలి
జిల్లా అధికారులందరూ ఒక్కొక్క కుటుంబాన్ని దత్తత తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. ఈ కార్యక్రమం కింద లక్ష్యాని ఆగస్టు 15 నాటికి చేరుకునేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ నెల 17 నుంచి ఆగస్టు 5వ తేదీ వరకు గ్రామ, వార్డు సభలు నిర్వహించాలన్నారు. ఎంపిక చేసిన బంగారు కుటుంబాల వద్దకు వెళ్లి వారికి ఏ రకమైన సహాయం కావాలనే వివరాలపై ఈ నెల 21 నుంచి ఆగస్టు 6 వరకు సర్వే నిర్వహించాలన్నారు. కాన్ఫరెన్స్‌లో సీపీఓ ఆశోక్‌కుమార్, డీఐసీ జెడ్‌ఎం శ్రీనివాస్‌యాదవ్, డీఈఓ ప్రసాద్‌బాబు, సమగ్ర శిక్ష ఏపీసీ శైలజ, డీపీఓ నాగరాజునాయుడు, డీఎంహెచ్‌ఓ దేవి, డీటీసీ వీర్రాజు, ఆర్డీఓలు, తదితరులు పాల్గొన్నారు.