
ఆక్రమణలో 2,903 ఎకరాల ఆలయ భూములు
●భూముల పరిరక్షణకు చర్యలు: కలెక్టర్
అనంతపురం అర్బన్: జిల్లా వ్యాప్తంగా 2,903 ఎకరాల దేవాలయ భూములు ఆక్రమణలకు గురయ్యాయని కలెక్టర్ వినోద్ కుమార్ తెలిపారు. ఆలయ భూముల పరిరక్షణకు యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్‌లోని మినీ కాన్ఫరెన్స్ హాలులో జాయింట్ కలెక్టర్ శివ్ నారాయణ్ శర్మతో కలిసి కలెక్టర్ జిల్లాస్థాయి ల్యాండ్ ప్రొటెక్షన్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ దేవాలయ భూములు కౌలుకు ఇవ్వడం ద్వారా వచ్చే ఆదాయాన్ని ఆలయ ధూప, దీప, నైవేద్యాలకు ఖర్చు చేయాల్సి ఉంటుందన్నారు. అలాంటి భూములు ఆక్రమణకు గురికావడాన్ని తీవ్రంగా పరిగణిస్తామన్నారు. జిల్లాలో దేవదాయ శాఖ పరిధిలోని ఆలయ భూములు ఎన్ని ఉన్నాయి.. అందులో ఎన్ని సాగులో ఉన్నాయి అనేది నిర్ధారించుకోవాలన్నారు. ఆక్రమణ గురైన వాటిని స్వాధీనం చేసుకోవడంతో పాటు భూములన్నీ మండల ఇన్‌చార్జి ద్వారా కౌలుకు ఇచ్చి సాగులోకి వచ్చేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. దేవాలయ భూములను సాగు చేసే కౌలు రైతులకు సీసీఆర్‌సీ కార్డులు ఇవ్వాలని చెప్పారు. జాతీయ రహదారులకు సంబంధించి దేవాలయ భూములను సేకరిస్తూ అందుకు పరిహారం వచ్చేలా చర్యలు తీసుకోవాలన్నారు. సమావేశంలో డీఆర్‌ఓ మలోల, దేవదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ తిరుమలరెడ్డి, ఆర్‌డీఓలు కేశవనాయుడు, వసంతబాబు, శ్రీనివాస్, భూ విభాగం సూపరింటెండెంట్ రియాజుద్దీన్, ఆలయాల ఈఓలు, ఏఈఓలు పాల్గొన్నారు.