
జోరుగా ‘ఆశల పరవళ్లు’..
బొమ్మనహాళ్: తుంగభద్ర జలాశయం నుంచి ఎగువ కాలువ (హెచ్చెల్సీ)కు గురువారం బోర్డు అధికారులు నీటిని విడుదల చేశారు. తుంగభద్ర బోర్డు సెక్రటరీ రామకృష్ణారెడ్డి, డ్యాం ఎస్‌ఈ నారాయణ నాయక్, హెచ్చెల్సీ ఈఈ చంద్రశేఖర్ డ్యాం వద్ద స్విచ్ ఆన్ చేసి నీటి విడుదలను లాంఛనంగా ప్రారంభించారు. అంతకు ముందు బోర్డు అధికారులు డ్యాంపై పూజలు చేశారు. సంప్రదాయబద్ధంగా వాయనం వదిలారు. ఈ సందర్భంగా బోర్డు సెక్రటరీ రామకృష్ణా రెడ్డి, డ్యాం ఎస్‌ఈ నారాయణ నాయక్ మాట్లాడుతూ తుంగభద్ర ఎగువ కాలువకు తొలుత 100 క్యూసెక్కుల నీరు వదిలి తరువాత ప్రతి రెండు గంటలకోసారి నీటి విడుదలను పెంచుతామని తెలిపారు. మొత్తంగా 500 క్యూసెక్కుల నీరు వదులుతున్నట్లు పేర్కొన్నారు. ఆంధ్రా, కర్ణాటక కోటా కలిపి నీరు విడుదల చేస్తున్నామన్నారు. ఖరీఫ్‌లో పంటల సాగుకు ఈ నెల 10 నుంచి నవంబర్ 30 వరకూ దాదాపు 1,300 క్యూసెక్కులు వదులుతామన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా జూలై మొదటి వారంలోనే డ్యాం నుంచి నదికి నీటిని విడుదల చేశామన్నారు. డ్యాం గరిష్ట నీటి నిల్వ సామర్థ్యం 100 టీఎంసీలు కాగా ఇటీవల 80 టీఎంసీలకు కుదించామన్నారు. 12వ తేదీ సాయంత్రం 6 గంటలకల్లా ఆంధ్రా సరిహద్దుకు తుంగభద్ర జలాలు చేరుతాయని అధికారులు తెలిపారు.
విషయాలు తెలియవంట..
గతంలో హెచ్చెల్సీకి నీరు విడుదలయ్యే సమయంలో స్థానిక అధికారుల్లో హడావుడి ఉండేది. ఎక్కడైనా కాలువలు దెబ్బతిన్నాయా అని పరిశీలించడంతో పాటు నీటి వినియోగంపై రైతులకు సలహాలు, సూచనలు ఇచ్చేవారు. ఈసారి మాత్రం ఆ పరిస్థితులే కనిపించడం లేదు. ఇన్‌చార్జ్ ఎస్‌ఈ విశ్వనాథరెడ్డి తనకేమీ పట్టనట్లు ఉన్నారు. గురువారం నీటి విడుదలపై ఆయనను వివరణ కోరగా... హెచ్చెల్సీకి నీటిని విడుదల చేసినట్లు ఉన్నారని, మిగిలిన విషయాలు తనకు తెలియవని, బోర్డు అధికారులతో మాట్లాడి కనుక్కోమని చెప్పారు. దీన్ని బట్టి చూస్తే హెచ్చెల్సీ అధికారుల నిర్లక్ష్య వైఖరి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.