
వైఎస్సార్‌సీపీ నేత సోదరి కట్టడం కూల్చివేత
తాడిపత్రి రూరల్: స్థానిక పెన్నానది ఒడ్డున వైఎస్సార్‌సీపీ నాయకుడు అయూబ్ బాషా సోదరి చేపట్టిన ఇంటి నిర్మాణాన్ని అనధికార కట్టడం పేరుతో మంగళవారం మున్సిపల్ అధికారులు కూల్చివేశారు. అన్ని అనుమతులు ఉన్నా... కేవలం అన్న వైఎస్సార్‌సీసీ నాయకుడనే అక్కసుతోనే ఈ దుశ్చర్యకు పాల్పడినట్లుగా తాడిపత్రిలో విమర్శలు వెల్లువెత్తాయి. ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా మంగళవారం తెల్లవారుజాము 6 గంటలకే హిటాచీతో అక్కడకు చేరుకున్న టౌన్ ప్లానింగ్ అధికారి సుజాత, ఇతర అధికారులు, సిబ్బంది దౌర్జన్యంగా కట్టడాన్ని కూల్చివేశారు. టౌన్‌ప్లానింగ్ అధికారి సుజాత మాట్లాడుతూ... రోడ్డును 5 మీటర్లు ఆక్రమించారని, సెట్‌బ్యాక్ లేకపోవడం, ప్లాన్‌కు వ్యతిరేకంగా నిర్మాణం చేపట్టినందుకు కట్టడాన్ని కూల్చివేస్తున్నట్లు పేర్కొన్నారు. అయితే ఇది పూర్తిగా కక్ష సాధింపు చర్యల్లో భాగమేనని అయూబ్ బాషా వాపోయారు.
జలధి ఉత్సవంలో ఘర్షణ
గుంతకల్లు రూరల్: మండలంలోని తిమ్మాపురంలో సోమవారం రాత్రి జరిగిన పీర్ల జలధి ఉత్సవంలో ఘర్షణ చోటు చేసుకుని ఇద్దరు గాయపడ్డారు. గుంతకల్లు రూరల్ సీఐ ప్రవీణ్‌కుమార్ తెలిపిన మేరకు.. పీర్లను జలధికి తరలిస్తున్న సమయంలో యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మరో పది నిమిషాల్లో ఉత్సవం ముగుస్తుందనగా.. సోమవారం అర్ధరాత్రి సమయంలో ఇద్దరు యువకుల మధ్య చిన్నపాటి గొడవ మొదలైంది. ఒకరికొకరు తోడవడంతో గొడవ పెద్దదైంది. ఆంజనేయులు గౌడ్, నాగరాజు గౌడ్ తాలూకు యువకుడు గొడవలో ఉండటంతో వారు సర్ధి చెప్పేందుకు మధ్యలోకి వెళ్లారు. అదే సమయంలో మాటామాట పెరిగి యువకులు బొజ్జయ్య, అనిల్, ఆనంద్, కుమార్ నేరుగా ఆంజనేయులు గౌడ్, నాగరాజు గౌడ్‌పై దాడి చేసి గాయపరిచారు. క్షతగాత్రులను కుటుంబ సభ్యులు వెంటనే గుంతకల్లులోని ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లారు. ఘటనపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.

వైఎస్సార్‌సీపీ నేత సోదరి కట్టడం కూల్చివేత

వైఎస్సార్‌సీపీ నేత సోదరి కట్టడం కూల్చివేత