
అధికారులు అన్యాయం చేశారు
అనంతపురం అర్బన్: బదిలీల కౌన్సెలింగ్‌లో అధికారులు తమకు తీవ్ర అన్యాయం చేశారని విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్లు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ నిబంధనలను అనుసరించలేదన్నారు. ర్యాంక్ (మెరిట్) ఆధారంగా బదిలీలు నిర్వహించకుండా ఇష్టారాజ్యంగా స్థానాలు కేటాయించారని మండిపడ్డారు. రాజకీయ సిఫారసు ఉన్నవారికి వారు కోరుకున్న స్థానాలు కేటాయించారని వాపోయారు. తమకు జరిగిన అన్యాయాన్ని కలెక్టర్ వినోద్‌కుమార్ దృష్టికి తీసుకెళ్లేందుకు బుధవారం కలెక్టరేట్‌కు వచ్చిన పలువురు విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్లు మీడియాతో మాట్లాడారు. ఉమ్మడి జిల్లా సచివాలయ విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్లకు గతనెల 28న బదిలీ కౌన్సెలింగ్ నిర్వహించారన్నారు. ఆరోజున కౌన్సెలింగ్‌కు హాజరైన తమ నుంచి ఆప్షన్ ఫారాలు తీసుకున్నారే తప్ప స్థానాలు కేటాయించలేదన్నారు. అదేమని అడిగితే మీ ఆప్షన్లలో ఏదో ఒకటి ఇస్తామని చెప్పారన్నారు. తీరా పోస్టింగ్ ఆర్డర్స్ ఒకటో తేదీన పంపారని, అందులో తామిచ్చిన ఆప్షన్లకు సంబంధం లేని మండలాల్లో పోస్టింగ్ ఇచ్చారన్నారు. ముందు ర్యాంకులో ఉన్న తమను కాదని తరువాత ర్యాంక్ వాళ్లకు తమ స్థానాలు ఇచ్చారని ఆరోపించారు. అంతే కాకుండా దివ్యాంగులు, మెడికల్, ఒంటరి మహిళలు, స్పౌజ్‌కు ప్రాధాన్యత ఇవ్వలేదన్నారు. ఇలా బదిలీల కౌన్సెలింగ్‌లో అధికారులు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించి తమకు అన్యాయం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు చేసిన అన్యాయాన్ని కలెక్టర్ దృష్టికి తీసుకెళతామని చెప్పారు. కార్యక్రమంలో అగ్రికల్చర్ అసిస్టెంట్లు నేత్ర, జహీర్, వాణిశ్రీ, తదితరులు పాల్గొన్నారు.
విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్ల ఆవేదన
రాజకీయ సిఫారసులకు
పెద్దపీట వేశారని మండిపాటు