ఆర్డీటీ మూతపడితే చరిత్ర హీనులవుతారు
కుందుర్పి: రాయలసీమ ప్రాంతంలో పేదరికాన్ని రూపుమాపేందుకు 55 ఏళ్లుగా ఎన్నో విశిష్ట సేవలు అందిస్తున్న ఆర్డీటీని మూతపడేలా చేస్తే చరిత్ర హీనులు కాకతప్పదని కూటమి ప్రభుత్వాన్ని వైఎస్సార్‌సీపీ పంచాయతీరాజ్ (పీఆర్) విభాగం రాష్ట్ర అధ్యక్షుడు వెన్నపూస రవీంద్రారెడ్డి హెచ్చరించారు. స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల చాంబర్లలోని మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చిత్రపటాలను తొలగించడంపై టీడీపీ నాయకులకు ఉన్న శ్రద్ధ ఆర్డీటీని కాపాడటంలో లేదని మండిపడ్డారు. ఆర్డీటీకి ఎఫ్‌సీఆర్‌ఏ రెన్యువల్ చేయాలనే డిమాండ్‌తో కళ్యాణదుర్గం వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త తలారి రంగయ్య చేపట్టిన పాదయాత్ర మంగళవారం కుందుర్పి మండలం కరిగానిపల్లికి చేరుకుంది. యాత్రకు రవీంద్రారెడ్డి సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా కరిగానిపల్లిలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, రైతాంగానికి ఆర్డీటీ అన్ని రకాలుగా చేదోడు ఉందన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంక్షేమ పథకాలు ప్రవేశ పెట్టక మునుపే జిల్లాలో ఆర్డీటీ ద్వారా మహోన్నత సేవా కార్యక్రమాలను డాక్టర్ ఫాదర్ విన్సెంట్ ఫెర్రర్ చేపట్టారన్నారు. అలాంటి సంస్థకు విదేశీ నిధులు అందకుండా గొంతు కోసే దుర్మార్గమైన చర్యకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తెరతీశాయని మండిపడ్డారు. ఆర్డీటీ కోసం ప్రజలలో చైతన్యం తీసుకువచ్చేందుకు డాక్టర్ తలారి రంగయ్య చేపట్టిన పాదయాత్రను అడ్డుకునేందుకు టీడీపీ పెద్దలు విశ్వ ప్రయత్నాలు చేయడం సిగ్గుచేటన్నారు.నిజంగా ఈ ప్రాంత అభివృద్ధిపై చిత్తశుద్ధి ఉంటే ఆర్డీటీని కాపాడుకునేందుకు స్థానిక ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబుతో పాటు ఉమ్మడి జిల్లాలోని ఎమ్మెల్యేలు, ఇద్దరు ఎంపీలు, స్థానిక ప్రజాప్రతినిధులు ముందుకు రావాలన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి బోయ తిప్పేస్వామి, పార్టీ నేత మాదినేని ఉమామహేశ్వర నాయుడు, ఎస్సీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చామలూరు రాజగోపాల్, రాయదుర్గం మున్సిపల్ మాజీ చైర్మన్ గౌని ఉపేంద్రారెడ్డి, సత్యనారాయణరెడ్డి, చంద్రశేఖర్‌రెడ్డి, ఎనుములదొడ్డి సర్పంచ్ విజయ్‌తో పాటు పలువురు పాల్గొన్నారు.
వైఎస్సార్‌సీపీ పీఆర్ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు వెన్నపూస


