
జిల్లా అంతటా సోమవారం ఉష్ణోగ్రతలు బాగా తగ్గాయి. గాలివేగం
‘చల్లగా’ వచ్చేసింది
● 10 రోజులు ముందుగానే ‘నైరుతి’ పలకరింపు
అనంతపురం అగ్రికల్చర్: ఆశల ‘నైరుతి’ (సౌత్‌వెస్ట్ మాన్‌సూన్స్) ఉమ్మడి అనంతను సోమవారం పలకరించింది. ఉమ్మడి జిల్లాలోకి రుతుపవనాలు ప్రవేశించినట్లు భారత వాతావరణ శాఖ (ఐఎండీ) అధికారికంగా ప్రకటించింది. సోమవారం ఆకాశం మేఘావృతమై చిరుజల్లులతో ‘నైరుతి’కి స్వాగతం పలికాయి. ఉమ్మడి జిల్లా పరిధిలో చాలా ప్రాంతాల్లో తేలికపాటి వర్షపాతం నమోదైంది. సాధారణంగా జూన్ 1న కేరళను తాకే రుతుపవనాలు జూన్ 5 లేదా ఆ తర్వాత అనంతపురం జిల్లాలోకి ప్రవేశించే పరిస్థితి ఉండేదని రేకులకుంట వ్యవసాయ పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ ఎం.విజయశంకరబాబు, సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ జి.నారాయణస్వామి తెలిపారు. అయితే ఈ సారి వాతావరణం అనుకూలంగా ఉన్నందున ఈనె 24న కేరళను తాకిన నైరుతి సోమవారం ‘అనంత’లోకి ప్రవేశించాయన్నారు. రుతువపనాల ప్రభావంతో రాగల మూడు రోజులు జిల్లాకు వర్షసూచన ఉందన్నారు. కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షం పడవచ్చన్నారు. కొన్ని ప్రాంతాల్లో 41 నుంచి 61 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తాయని తెలిపారు. చాలా ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన మోస్తరు వర్షం పడవచ్చన్నారు.
ఖరీఫ్‌కు కీలకం..
ఉమ్మడి జిల్లా పరిధిలో ఖరీఫ్ కింద దాదాపు 8 లక్షల హెక్టార్ల భారీ విస్తీర్ణంలో సాగులోకి వచ్చే వ్యవసాయ, ఉద్యాన పంటలకు ‘నైరుతి’ ప్రభావంతో కురిసే వర్షాలే కీలకం. రుతుపవనాలు ప్రభావం చూపిస్తే మంచి వర్షాలు కురుస్తాయి. జూన్ నుంచి సెప్టెంబర్ మధ్య నాలుగు నెలల పాటు వీటి ప్రభావంతో వర్షాలు నమోదవుతాయి. జిల్లా వార్షిక సాధారణ వర్షపాతం 512.4 మి.మీ కాగా అందులో కీలకమైన ఖరీఫ్ నాలుగు నెలల కాలంలో 319.7 మి.మీ నమోదు కావాల్సి ఉంటుంది. జూన్‌లో 61 మి.మీ, జూలైలో 63.9 మి.మీ, ఆగస్టులో 83.8 మి.మీ, సెప్టెంబర్‌లో 110.9 మి.మీ సాధారణ వర్షపాతంగా నిర్ధారించారు.