
రేయ్ సాయిరాం నిన్ను చంపేస్తాం...
● తాడిపత్రిలో అర్ధరాత్రి వేళ
రెచ్చిపోయిన టీడీపీ మూకలు
తాడిపత్రిటౌన్: తాడిపత్రిలో శనివారం అర్ధరాత్రి టీడీపీ అల్లరి మూకలు రెచ్చిపోయాయి. వైఎస్సార్‌సీపీ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ప్రధాన అనుచరుడు సాయిరాం ఇంటిపై రాళ్లదాడికి తెగబడ్డాయి. దీంతో పట్టణవాసులు భయభ్రాంతులకు గురయ్యారు. వివరాలు... తాడిపత్రిలోని భగత్‌సింగ్ నగర్‌లో నివాసముంటున్న సాయిరాం ఇంటి వద్దకు శనివారం అర్ధరాత్రి 10 మంది టీడీపీ అల్లరి మూకలు మద్యం మత్తులో స్కార్పియో వాహనంలో చేరుకున్నాయి. ‘రేయ్ సాయిరాం.. బయటకు రారా.. నిన్ను చంపేస్తాం’’ అంటూ కేకలు వేస్తూ హల్‌చల్ చేశాయి. దీంతో సాయిరాం కుటుంబ సభ్యులతో పాటు కాలనీ వాసులు భయభ్రాంతులకు గురయ్యారు. బిక్కుబిక్కుమంటూ లోపలే ఉండిపోయారు. ఎంత అరిచినా సాయిరాం బయటకు రాకపోవడంతో అల్లరి మూకలు అతని ఇంటిపై రాళ్లదాడికి దిగాయి. ఇంటి తలుపులు, ద్విచక్ర వాహనాన్ని ధ్వంసం చేశాయి. ఫోన్‌లో సాయిరాం ఇచ్చిన సమాచారంతో పోలీసులు ఘటనాస్థలికి చేరుకోగా.. మెల్లిగా అక్కడి నుంచి అల్లరి మూకలు జారుకున్నాయి. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. సీసీ ఫుటేజీ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ సాయిప్రసాద్ తెలిపారు.