
వైఎస్సార్‌సీపీ కార్యకర్తపై దాడి
పుట్లూరు: మండలంలోని గరుగుచింతలపల్లి గ్రామానికి చెందిన వైఎస్సార్‌సీపీ కార్యకర్త పెద్దన్నపై అదే గ్రామానికి చెందిన టీడీపీ కార్యకర్తలు దాడికి పాల్పడ్డారు. గ్రామంలోని పెద్దమ్మ ఆలయం వద్ద టీడీపీ నాయకులు మద్యం అమ్మకాలు జరుపుతుండడంతో పెద్దన్న అభ్యంతరం తెలిపాడు. దీంతో టీడీపీ కార్యకర్త నవీన్‌తో పాటు మరికొందరు ఆదివారం దాడికి తెగబడినట్లు బాధితుడి కుటుంబ సభ్యులు తెలిపారు.
వ్యక్తిపై కత్తితో దాడి
పెద్దవడుగూరు: మండలలోని గుత్తిఅనంతపురం గ్రామానికి చెందిన తప్పిళ్ల ఆంజనేయులుపై శనివారం రాత్రి కత్తితో దాడి చేశారు. బండిశూల తిరునాలలో శివ, సాయితో ఆంజనేయులుకు గొడవ జరిగింది. స్థానికులు సర్ధి చెప్పి పంపారు. రాత్రి మటన్ పంచుకునే సమయంలో ఆంజనేయులుపై శివ, సాయి కత్తి దాడి చేశారు. తీవ్రంగా గాయపడిన ఆంజనేయులు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
పీఆర్సీ వెంటనే ప్రకటించాలి
అనంతపురం ఎడ్యుకేషన్: పీఆర్సీ 12వ కమిటీ చైర్మన్‌ను వెంటనే నియమించి పీఆర్సీ ప్రకటించాలని యూటీఎఫ్ రాష్ట్ర సహాధ్యక్షుడు కె.సురేష్‌కుమార్ డిమాండ్ చేశారు. ఆదివారం నగరంలో యూటీఎఫ్ ఉద్యమ శిక్షణ తరగతులు నిర్వహించారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన సురేష్‌కుమార్ మాట్లాడుతూ.. పీఆర్సీ కమిషన్ ఏర్పాటు ఆలస్యమైతే ఉద్యోగులకు 30 శాతం మధ్యంతర భృతి ప్రకటించాలని డిమాండ్ చేశారు. పెండింగ్‌లో ఉన్న డీఏలను చెల్లించాలన్నారు. మెమో 57 ప్రకారం 2004 సెప్టెంబరుకు ముందు నియామకమైన 11 వేల మంది ఉద్యోగ, ఉపాధ్యాయులకు పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలన్నారు. టీచర్ల బదిలీల జీఓను వెంటనే విడుదల చేసి వేసవిసెలవుల్లోనే బదిలీల ప్రక్రియ పూర్తి చేయాలన్నారు. ఎస్జీటీలకు మ్యానువల్ కౌన్సెలింగ్ ద్వారా బదిలీలు చేపట్టాలన్నారు. స్కూల్ అసిస్టెంట్ స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్లకు బదిలీల్లో కొత్తగా మంజూరై పోస్టులను ఖాళీలుగా చూపాలన్నారు. జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు గోవిందరాజులు, లింగమయ్య మాట్లాడుతూ.. పదోన్నతుల సీనియార్టీకి సంబంధించిన సమస్యలు పరిష్కరించాలన్నారు. యూటీఎఫ్ నాయకులు ఈశ్వరయ్య, రమణయ్య, హనుమంతరెడ్డి, రవికుమార్, సుబ్బరాయుడు, శేఖర్, రాముడు, చంద్రమోహన్, దేవేంద్రమ్మ పాల్గొన్నారు.
కెంచంపల్లిలో చిరుత కలకలం
కుందుర్పి: మండలంలోని కెంచంపల్లిలో ఆదివారం అర్ధరాత్రి చిరుత కలకలం రేపింది. గొర్రెల మందపై దాడి చేయడంతో కుక్కలు చుట్టుముట్టాయి. దీంతో చిరుత సమీపంలోని కొబ్బరి చెట్టు ఎక్కింది. అదే సమయంలో మేల్కొన్న గొర్రెల కాపరులు కేకలు వేస్తూ బెదరగొట్టడంతో గుట్టల్లోకి పరుగు తీసినట్లు గొర్రెల కాపరి ఈరన్న తెలిపాడు.

వైఎస్సార్‌సీపీ కార్యకర్తపై దాడి

వైఎస్సార్‌సీపీ కార్యకర్తపై దాడి