
కక్ష సాధింపుపై కన్నెర్ర
● సాక్షి ఎడిటర్ ఇంట్లో సోదాలు పత్రికాస్వేచ్ఛను హరించడమే
● అనంతలో జర్నలిస్టుల నిరసనాగ్రహం
అనంతపురం: మీడియాపై కూటమి ప్రభుత్వం కక్షసాధింపులకు దిగడంపై జర్నలిస్టులు కన్నెర్రజేశారు. అక్రమ కేసులు పెడుతూ, ఖాకీలతో దాష్టీకానికి పాల్పడుతున్న రాష్ట్ర ప్రభుత్వ విధానాలపై మండిపడ్డారు. ‘సాక్షి’ ఎడిటర్ ఆర్.ధనంజయరెడ్డి నివాసంలో గురువారం పోలీసులు సోదాలు చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సెర్చ్ వారెంట్ లేకుండా అక్రమంగా ఇంట్లోకి చొరబడి వ్యవహరించిన తీరును తప్పుపట్టారు. ప్రజాస్వామ్య పాలనలో ఇదో మాయని మచ్చగా అభివర్ణించారు. ప్రభుత్వం, పోలీసుల తీరుకు నిరసనగా ‘సాక్షి’ బ్యూరో ఇన్‌చార్జ్ గుండం రామచంద్రారెడ్డి (ఆర్‌సీఆర్), సాక్షి ఎడిషన్ ఇన్‌చార్జ్ తోలేటి మహేశ్వరరెడ్డి, సాక్షి టీవీ కరస్పాండెంట్ శివారెడ్డి ఆధ్వర్యంలో శుక్రవారం జిల్లా పరిషత్ కార్యాలయ సమీపంలోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విగ్రహం వద్ద జర్నలిస్టులు ఆందోళన నిర్వహించారు. కార్యక్రమానికి ఏపీడబ్ల్యూజేయూ రాష్ట్ర అధ్యక్షుడు మచ్చా రామలింగారెడ్డి, జాప్ జిల్లా అధ్యక్షుడు బండి సుబ్రహ్మణ్యంరెడ్డి, మన అనంతపురం పత్రిక ఎడిటర్ తోట నాగరాజు, సీనియర్ జర్నలిస్టులు రమణ, శ్రీకాంత్, ఆశ్రయ కృష్ణారెడ్డి, ప్రముఖ కవి రియాజుద్దీన్ అహమ్మద్ తదితరులు సంఘీభావం తెలిపారు.
సోదాలు అప్రజాస్వామిక చర్య
రాష్ట్రంలో ప్రముఖ దినపత్రిక ఎడిటర్‌పై వేధింపులకు పాల్పడటం చరిత్రలో ఇదే తొలిసారి. అసలు రాష్ట్రంలో పత్రికా స్వేచ్ఛ ఉందా? విలేకరులపై దాడులు నిత్యకృత్యమవుతున్నాయి. సాక్షి ఎడిటర్ ఆర్.ధనంజయరెడ్డి ఇంటిపై సెర్చ్ వారెంట్ లేకుండా సోదాలు చేయడం అప్రజాస్వామిక చర్య. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే పోలీసు అధికారులపై కేసులు పెడతాం. ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకు ఫిర్యాదు చేస్తాం. – మచ్చా రామలింగారెడ్డి, ఏపీడబ్ల్యూజేయూ రాష్ట్ర అధ్యక్షుడు
కక్ష సాధింపు తగదు
ఉరవకొండ/వజ్రకరూరు: కూటమి ప్రభుత్వ పాలనలో లోటుపాట్ల గురించి ‘సాక్షి’లో కథనాలు ప్రచురితమైతే.. వాటిని సరిదిద్దుకునేది పోయి పత్రిక ఎడిటర్‌పై కక్ష సాధింపు చర్యలకు దిగడం సబబు కాదని మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్‌సీపీ ఉరవకొండ నియోజకవర్గ సమన్వయకర్త వై.విశ్వేశ్వరరెడ్డి అన్నారు. శుక్రవారం వజ్రకరూరులో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సాక్షి దినపత్రిక ఎడిటర్ ధనంజయరెడ్డి ఇంట్లో పోలీసులు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండానే సోదాలు చేపట్టడాన్ని ఖండించారు. ఇది పత్రికాస్వేచ్ఛపై దాడిగా భావించాల్సి వస్త్తుందన్నారు. కూటమి ప్రభుత్వ పెద్దల మెప్పు కోసం ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడి పోలీసులు తమ వ్యవస్థకున్న ప్రతిష్టను దిగజారుస్తున్నారని మండిపడ్డారు. అధికారం శాశ్వతం కాదనే విషయాన్ని పోలీసులు గుర్తుపెట్టుకోవాలన్నారు. పత్రికా స్వేచ్ఛకు సంకెళ్లు వేయాలనుకోవడం కూటమి నేతల అవివేకానికి నిదర్శనమన్నారు.
సంఘటితంగా పోరాడాలి
సాక్షి ఎడిటర్ ధనంజయరెడ్డి ఇంట్లో సెర్చ్ వారెంట్ లేకుండా పోలీసులు సోదాలు చేసి అవమానపరిచారు. సంబంధం లేకుండా పత్రికా సంపాదకులను ఇలా ఇబ్బంది పెట్టడం ఎంత వరకు న్యాయం? అక్రమ కేసులు, దాడులపై జర్నలిస్టులు అందరూ సంఘటితంగా పోరాడాలి.
– గుండం రామచంద్రారెడ్డి, సాక్షి బ్యూరో ఇన్‌చార్జ్
వార్తలు వస్తే కేసులా..?
పత్రికల్లో వార్తలు రాస్తే కేసులు నమోదు చేయడం పాత్రికేయుల నైతిక బలాన్ని హరించాలని చూడడమే. కోర్టులో కేసు నడుస్తుండగా, కనీసం నోటీసులు ఇవ్వకుండా సాక్షి ఎడిటర్ ధనంజయరెడ్డి ఇంటిలో సోదాలు చేయడం బాధాకరం. పోలీస్ శాఖ అనైతిక చర్యలకు దిగడం ప్రజాస్వామ్యంలో మీడియాకు గొడ్డలిపెట్టు వంటిది. ప్రజాస్వామ్యవాదులు, మీడియా స్వేచ్చ, భావ ప్రకటనాస్వేచ్ఛ కోరుకునే వారందరూ ఇలాంటి ఘటనలను ఖండించాలి. –బండి సుబ్రహ్మణ్యంరెడ్డి, ‘జాప్’ జిల్లా అధ్యక్షుడు

కక్ష సాధింపుపై కన్నెర్ర

కక్ష సాధింపుపై కన్నెర్ర

కక్ష సాధింపుపై కన్నెర్ర

కక్ష సాధింపుపై కన్నెర్ర