
ఆలోచన నుంచి ఆవిష్కరణ వరకూ
అనంతపురం: యువ ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలకు ప్రోత్సాహం అందించే దిశగా అనంతపురంలో రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్’ పేరుతో ఇన్నోవేషన్ ప్రాంతీయ హబ్‌ను ఏర్పాటు చేయనున్నారు. విజయవాడ కేంద్రంగా ఏర్పాటు కానున్న రతన్ ఇన్నోవేషన్ హబ్‌కు అనుబంధంగా ఎన్టీఆర్ జిల్లా, విశాఖపట్నం, రాజమండ్రి, తిరుపతి, అనంతపురంలో ప్రాంతీయ హబ్ (హబ్ స్పోక్ సెంటర్)లను ఏర్పాటు చేస్తున్నారు. ఇందుకు సంబంధించి అనంతపురంలోని ప్రభుత్వ పాటిటెక్నిక్ కళాశాల పరిధిలోని ఐదు ఎకరాల్లో శాశ్వత భవనాల నిర్మాణం శరవేగంగా సాగుతోంది. భవనాలు అందుబాటులో వచ్చే వరకూ తాత్కాలికంగా జేఎన్‌టీయూ (ఏ) పాత పాలక భవనం నుంచి కార్యకలాపాలు కొనసాగించేలా చర్యలు తీసుకున్నారు.
ప్రైవేట్ సంస్థల పర్యవేక్షణలో..
ప్రాంతీయ హబ్‌ల నిర్వహణను ప్రైవేట్ సంస్థలు పర్యవేక్షించనున్నాయి. సీడ్ క్యాపిట్‌లను ప్రభుత్వం అందిస్తుంది. అనంతపురంలో ఏర్పాటు కానున్న రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్‌కు ఇండస్ట్రీయల్ భాగస్వాములుగా కియా కంపెనీ, జేఎస్‌డబ్ల్యూ స్టీల్ కంపెనీ వ్యవహరించనున్నాయి. నాలెడ్జ్ భాగస్వాములుగా జేఎన్‌టీయూ (ఏ), సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ అనంతపురం కీలకంగా వ్యవహరించనున్నాయి. హబ్‌లు పూర్తిస్థాయిలో పనిచేసే వరకూ జిల్లా స్థాయిలో టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు చేయనున్నారు. ఇందులో డీఐసీ జీఎం, డీఆర్‌డీఏ పీడీ, మెప్మా పీడీ, ఏపీఐఐసీ జోనల్ మేనేజర్ సభ్యులుగా ఉంటారు. స్కిల్ డెవలప్‌మెంట్, ఇన్నోవేషన్, స్టార్టప్స్, ఫెసిలిటేషన్‌ల లక్ష్యంగా ఈ హబ్ పనిచేయనుంది.
సెక్షన్ ఫారం 8 కంపెనీగా నమోదు
రతన్‌టాటా ఇన్నోవేషన్ ప్రాంతీయ హబ్‌ను సెక్షన్ ఫారమ్ 8 కంపెనీగా నమోదు చేయనున్నారు. ఈ నేపథ్యంలో పబ్లిక్–ప్రైవేట్ పార్టనర్షిప్ (పీపీపీ) మోడల్ నమోదుపై చర్చ జరిగింది. పరిశ్రమలతో మెమొరాండం ఆఫ్ అసోసియేషన్ (ఎంఏఓ), ఆర్టికల్ ఆఫ్ అసోసియేషన్ (ఏఓఏ)ను ఈ సందర్భంగా ఏర్పాటు చేయనున్నారు. బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ సభ్యులతో ఓ కమిటీ ఏర్పాటు చేసి, వ్యూహాత్మక నిర్ణయాలను పరిశీలించాలనే ప్రతిపాదన కూడా ఉంది.
‘అనంత’లో రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్
ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలకు చెందిన 5 ఎకరాల్లో ఏర్పాటుకు సన్నాహాలు
అప్పటి వరకూ జేఎన్‌టీయూ(ఏ)
పాత పాలక భవనంలో నిర్వహణ
నూతన ఆవిష్కరణలకు దన్నుగా..
విద్యార్థి ఆలోచన ఏదైనా సరే దాని ఆవిష్కరణకు రతన్ టాటా ఇన్నోవేషన్ ప్రాంతీయ హబ్ దోహదపడుతుంది. కంపెనీ రిజిస్ట్రేషన్ సులభతరంగా నిర్వహించడంతో పాటు ఇందుకు అయ్యే ఖర్చునూ హబ్ భరిస్తుంది. నూతన ఆవిష్కరణలకు అవసరమైన సాంకేతిక శిక్షణను అందిస్తారు. ఈ ప్రాజెక్ట్‌లో జేఎన్‌టీయూ (ఏ) భాగస్వామిగా ఉండడం గర్వకారణం.
–ప్రొఫెసర్ హెచ్.సుదర్శనరావు,
వీసీ, జేఎన్‌టీయూ(ఏ)

ఆలోచన నుంచి ఆవిష్కరణ వరకూ