ప్రభుత్వ నిర్ణయాలతో హంద్రీ–నీవాకు ప్రమాదం | - | Sakshi
Sakshi News home page

ప్రభుత్వ నిర్ణయాలతో హంద్రీ–నీవాకు ప్రమాదం

May 8 2025 7:52 AM | Updated on May 8 2025 7:52 AM

ప్రభుత్వ నిర్ణయాలతో హంద్రీ–నీవాకు ప్రమాదం

ప్రభుత్వ నిర్ణయాలతో హంద్రీ–నీవాకు ప్రమాదం

అనంతపురం కార్పొరేషన్‌: కూటమి ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలతో హంద్రీ–నీవాకు ప్రమాదం ముంచుకొస్తోందని మాజీ ఎమ్మెల్యే, ఉరవకొండ నియోజకవర్గ వైఎస్సార్‌ సీపీ సమన్వయకర్త విశ్వేశ్వర రెడ్డి పేర్కొన్నారు. బుధవారం నగరంలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కరువు ప్రాంతమైన అనంతపురం జిల్లా పరిస్థితులను సీఎం చంద్రబాబు మానవత్వంతో పరిశీలించి, రాయలసీమ జిల్లాలకు నీరందించే హంద్రీ–నీవాను బలోపేతం చేయాలన్నారు. జిల్లాకు 65 టీఎంసీల నీరు అవసరం ఉందని, ఆ మేరకు హంద్రీ–నీవాను 6,300 క్యూసెక్కులకు వెడల్పు చేయాలన్నారు. గాలేరు–నగరి నీటిని వినియోగించుకునేలా చర్యలు తీసుకోవాలన్నారు. 2009లో దివంగత నేత వైఎస్సార్‌ హయాంలో పనులు వేగవంతంగా జరిగాయన్నారు. గత ప్రభుత్వంలో అప్పటి సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి హంద్రీ–నీవా ద్వారా 6,300 క్యూసెక్కుల నీటిని తీసుకువచ్చేలా రూ.6,018 కోట్లతో టెండర్లను పిలిచిన విషయాన్ని గుర్తు చేశారు. కూటమి ప్రభుత్వం ఆ పనులు కొనసాగించి ఉంటే మరో రెండున్నర లక్షల ఎకరాలకు సాగు నీరు అంది ఉండేవన్నారు. అలాగే, రూ.5 వేల కోట్లతో గాలేరు–నగరిని హంద్రీ–నీవాతో అనుసంధానించాలని నిర్ణయం తీసుకుని రూ.1,500 కోట్లు ఖర్చు చేశారన్నారు. కానీ కూటమి ప్రభుత్వంలో సీఎం చంద్రబాబు దురుద్దేశపూర్వకంగా పాత జీఓలను రద్దు చేసి కేవలం 3,850 క్యూసెక్కులకు హంద్రీ–నీవాను కుదించి అన్యాయం చేశారన్నారు. గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను వ్యతిరేకించడమే పనిగా పెట్టుకుని, ప్రజా ప్రయోజనాలను తాకట్టు పెడుతున్నారని ధ్వజమెత్తారు. హంద్రీ–నీవా ఫేజ్‌ 2 లైనింగ్‌ పనులను జిల్లా ప్రజలు అంగీకరించడం లేదన్నారు. లైనింగ్‌ టెండర్లు సీఎం చంద్రబాబు తన అస్మదీయులకు అప్పగించారని, రూ.743.85 కోట్లకు టెండర్లు పిలిచి దాదాపు రూ.200 కోట్ల ఎక్సెస్‌తో రూ.936.70 కోట్లకు కట్టబెట్టారని దుయ్యబట్టారు. జీడిపల్లి రిజర్వాయర్‌ కోసం భూములిచ్చిన 645 మంది రైతులకు రూ.10 లక్షల ప్రకారం ఒక ప్యాకేజీ సిద్ధం చేసి ఉందని, ఆ మేరకు పరిహారం ఇచ్చి జీడిపల్లిని పునర్నిర్మాణం చేయాల్సి ఉందన్నారు. ఉంతకల్లు, వజ్రకరూరు చెరువులకు నీరందించడానికి సంబంధించి కూడా చంద్రబాబు ప్రకటన చేయాలన్నారు. చేనేతకు సంబంధించి ఉరవకొండ పెద్ద కేంద్రమని ‘విశ్వ’ గుర్తు చేశారు. గతంలో చేనేత క్లస్టర్‌ ఏర్పాటు పనులు మొదలైనా సాంకేతిక సమస్యల కారణంగా ఆగిపోయాయని, ఈ విషయంపైనా తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. రాజధాని పేరుతో వెనుకబడ్డ ప్రాంతాలను విస్మరించడం తగదన్నారు. 11 నెలల్లోనే రూ.1.65 లక్షల కోట్ల అప్పు చేసి ఆ భారం ప్రజలపై మోపుతున్నారన్నారు. రానున్న రోజుల్లో కూటమి ప్రభుత్వానికి ప్రజాస్వామ్య పద్ధతిలో బుద్ధి చెబుతామని స్పష్టం చేశారు. సమావేశంలో వైఎస్సార్‌ ట్రేడ్‌ యూనియన్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి మాసినేని నరేష్‌, ఎస్టీ సెల్‌ జిల్లా ఉపాధ్యక్షుడు గోవింద్‌ నాయక్‌, కూడేరు మండల కన్వీనర్‌ రామచంద్రారెడ్డి, విద్యార్థి విభాగం నాయకులు నవీన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

దురుద్దేశపూర్వకంగానే 3,850 క్యూసెక్కులకు కుదించారు

కాలువ బలోపేతంపై సీఎం చంద్రబాబు స్పష్టమైన ప్రకటన చేయాలి

ఉరవకొండ నియోజకవర్గ సమన్వయకర్త విశ్వ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement