
తారస్థాయికి దాహం కేకలు
కళ్యాణదుర్గం: ఉమ్మడి జిల్లాలో దాహం కేకలు తారస్థాయికి చేరాయి. కడుపు మండిన జనం రోడ్లెక్కుతున్నారు. జిల్లాలో ఇలాంటి ఘటనలు నిత్యం ఎక్కడో చోట వెలుగులోకి వస్తుండటం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. తాజాగా కళ్యాణదుర్గం మండలం అండేపల్లిలో, కుందుర్పి మండలంలోని తూముకుంట గ్రామంలో తాగునీటి సమస్యపై గ్రామస్తులు ఆర్తనాదాలు పెట్టారు. ‘తాగునీరందించండి మహాప్రభో’ అంటూ విన్నవించుకున్నారు. అండేపల్లి గ్రామస్తులు ఖాళీ బిందెలతో ఎంపీడీఓ కార్యాలయాన్ని ముట్టడించారు. తూముకుంటవాసులు గ్రామంలో సచివాలయానికి తాళాలు వేసి గంట పాటు నిరసన వ్యక్తం చేశారు. తమ గ్రామం నుంచి సుమారు మూడున్నర కిలోమీటర్లు ఖాళీ బిందెలతో అండేపల్లివాసులు ర్యాలీ నిర్వహించడం చూస్తే క్షేత్రస్థాయిలో తాగునీటి సమస్య ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈ సందర్భంగా ఆయా గ్రామస్తులు మాట్లాడుతూ తాగునీరు కూడా అందజేయని పాలకులు, అధికారులెందుకని నిలదీశారు. శ్రీరామిరెడ్డి పథకం నీరు రాకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు వాపోయారు. కూటమి నేతలు తమ స్వలాభం తప్ప ప్రజా సమస్యలను పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే ఎంపీపీ లక్ష్మిదేవి స్పందించి.. అండేపల్లి గ్రామంలో మరో బోరు వేసేందుకు వెంటనే ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించడంతో గ్రామస్తులు నిరసన విరమించారు.

తారస్థాయికి దాహం కేకలు