
పొంచి ఉన్న విత్తన గండం
● విత్తన వేరుశనగ సేకరణపై
బాబు సర్కారు మొద్దునిద్ర
● బడ్జెట్ విడుదల చేయకుండా నిర్లక్ష్యం
● ఇప్పటికే నాణ్యమైన విత్తనకాయలు వ్యాపారుల పాలు
● రైతులకు నాసిరకం విత్తనాలే గతి!
అనంతపురం అగ్రికల్చర్: రైతులకు ఈ ఖరీఫ్‌లో నాణ్యమైన విత్తన వేరుశనగ అందే పరిస్థితి కనిపించడం లేదు. రబీలో విత్తన వేరుశనగ సేకరణపై బాబు సర్కారు మొద్దునిద్ర వహించడమే ఇందుకు నిదర్శనం. ఏటా రబీలో రైతులు పండించే వేరుశనగను ఏపీ సీడ్స్, వ్యవసాయశాఖ ద్వారా ముందస్తుగా కొనుగోలు చేసేవారు. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ విడుదల చేసేది. ఖరీఫ్‌లో రైతులకు రాయితీతో నాణ్యమైన విత్తనం అందించేది. అయితే, రైతుల పట్ల చిన్నచూపు ధోరణి అవలంబిస్తున్న చంద్రబాబు ప్రభుత్వం ఈ ఏడాది ఇంకా ఆ ప్రక్రియపై దృష్టి సారించనే లేదు. ఇటీవల విత్తన సేకరణ ధర (క్వింటా రూ.9,300) ఖరారైతే చేసింది కానీ, బడ్జెట్ మాత్రం విడుదల చేయలేదు. గత ఖరీఫ్‌కు సంబంధించి ఏపీ సీడ్స్‌కు అందాల్సిన రూ.90 కోట్లు(ఉమ్మడి జిల్లా), రాష్ట్ర వ్యాప్తంగా రూ.200 కోట్ల బకాయిలు కూడా కూటమి ప్రభుత్వం విడుదల చేయకపోవడం గమనార్హం.
మంచి విత్తనం దళారులపాలు..
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఈ రబీలో 10 వేల హెక్టార్లలో వేరుశనగ సాగు చేశారు. ఇటీవల పంట కోతలు కూడా మొదలయ్యాయి. కూటమి ప్రభుత్వ నిర్వాకం కారణంగా విత్తన సేకరణ ప్రారంభం కాకపోవడంతో మంచి విత్తనం వ్యాపారుల పాలవుతోంది. కొనుగోలు చేసిన వేరుశనగను దళారులు, వ్యాపారులు ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఈ క్రమంలో ఖరీఫ్‌లో రైతన్నలకు నాసిరకం విత్తనాలే దిక్కయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి.
విత్తన కేటాయింపుల్లో కోతలు..
ఈ సారి విత్తన కేటాయింపుల్లోనూ చంద్రబాబు ప్రభుత్వం కొర్రీలు వేసి అన్నదాతలను నిరాశపర్చింది. జిల్లాకు 1,51,978 క్వింటాళ్ల రాయితీ విత్తనాలు అవసరమని ప్రతిపాదనలు పంపగా... 54,184 క్వింటాళ్లు కేటాయిస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. అలాగే శ్రీ సత్యసాయి జిల్లాకు 1.60 లక్షల క్వింటాళ్లు కావాలని ప్రతిపాదించగా 60 వేల క్వింటాళ్లకు అనుమతిచ్చారు. ఈ క్రమంలో రైతులు విత్తనం కోసం కూడా అగచాట్లు పడాల్సిన పరిస్థితి నెలకొంది. ఇక.. జీలుగ, జనుము, పిల్లిపెసర లాంటి పచ్చిరొట్ట విత్తనాలు (గ్రీన్ మెన్యూర్) 750 క్వింటాళ్లు 50 శాతం రాయితీతో పంపిణీ చేస్తామని 15 రోజుల క్రితమే ప్రకటించారు. కానీ 750 క్వింటాళ్లకు 207 క్వింటాళ్లకు కుదించినా ఇప్పటి వరకు క్వింటా కూడా సరఫరా చేయకపోవడం చూస్తే రైతుల పట్ల ప్రభుత్వం ఎంత నిర్లక్ష్య వైఖరి కనబరుస్తోందో అర్థం చేసుకోవచ్చు.
అన్నదాతల మండిపాటు..
రెండేళ్లుగా సరైన పంట దిగుబడులు లేవు. కరువు పరిస్థితులు నెలకొన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఆపన్న హస్తం అందించి ఆదుకోవాల్సిన బాబు సర్కారు.. అడుగడుగునా నిర్లక్ష్య ధోరణి ప్రదర్శిస్తుండటంపై అన్నదాతలు మండిపడుతున్నారు. ఇప్పటికే రాయితీ విత్తన సరఫరాలో కోతలు వేసి నిరాశ పర్చిందే కాక.. విత్తన సేకరణపై ఇప్పటికీ దృష్టి సారించకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వచ్చే నెల నుంచి కీలకమైన ఖరీఫ్ (ముంగారు) ఆరంభం కానున్నా ప్రభుత్వం మొద్దు నిద్ర పోతుండటంతో.. ఈ సారి విత్తన విపత్తు తప్పేలా లేదంటూ నిట్టూరుస్తున్నారు.