
‘కుట్టు’లో భారీ అవినీతి
అనంతపురం అర్బన్: మహిళలకు కుట్టు శిక్షణ, కుట్టు మిషన్ల పంపిణీ పేరుతో కూటమి ప్రభుత్వం భారీ స్కామ్‌కు తెరతీసిందని వైఎస్సార్‌సీపీ మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు శ్రీదేవి ఆరోపించారు. ఈ మేరకు జాయింట్ కలెక్టర్ శివ్‌నారాయణ్ శర్మను మంగళవారం కలెక్టరేట్‌లోని మినీ కాన్ఫరెన్స్ హాల్‌లో వైఎస్సార్‌సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కృష్ణవేణి, రజక కార్పొరేషన్ మాజీ చైర్మన్ మీసాల రంగన్న, అనంతపురం నియోజకవర్గ బీసీ సెల్ అధ్యక్షుడు బోయ లక్ష్మన్న, వైఎస్సార్ సీపీ ప్రధాన కార్యదర్శి అల్తాఫ్ అహమ్మద్, ఇతర నాయకులతో కలసి వినతిపత్రం అందజేసి, మాట్లాడారు. రాష్ట్రంలో లక్ష మంది బీసీ మహిళలకు కుట్టు శిక్షణ, మిషన్ల అందజేత పేరుతో ఒక్కొక్కరికి రూ.23 వేలు చొప్పున రూ.230 కోట్లతో టెండర్‌ను తమకు అనుకూలమైన అవుట్ సోర్సింగ్ వ్యక్తికి కట్టబెట్టారన్నారు. వాస్తవానికి లబ్ధిదారునికి కుట్టు శిక్షణ, మిషన్ ఖర్చు రూ.7,300 మాత్రమే అవుతుందన్నారు. ఈ ప్రకారం మొత్తం లక్ష మందికి గాను ఖర్చు రూ.73 కోట్లు పోను మిగిలిన రూ.167 కోట్లు ఎవరి ఖాతాలోకి మళ్లిస్తున్నారో ప్రభుత్వ పెద్దలే చెప్పాలన్నారు. మొత్తం ఈ స్కామ్‌పై విచారణ జరిపి కారకులైన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ వినతి పత్రాన్ని అందజేశారు. కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ మహిళ విభాగం నాయకులు జాహ్నవిరెడ్డి, శోభాబాయి, శోభారాణి, పార్వతమ్మ, అంజలి, భానుమతి, పద్మావతి, లక్ష్మీదేవి, ప్రసన్న, జయమ్మ, లక్ష్మి, కళావతి, నారాయణమ్మ, రాధమ్మ పాల్గొన్నారు.
రూ.230 కోట్ల టెండర్‌లో రూ.167 కోట్ల స్కామ్
వైఎస్సార్‌సీపీ మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు శ్రీదేవి