
34 ప్రాంతాల్లో తగ్గిన భూగర్భజలాలు
అనంతపురం అగ్రికల్చర్: జిల్లాలోని 34 ప్రాంతాల్లో భూగర్భజలాలు తగ్గిపోయాయి. జిల్లా వ్యాప్తంగా ఉన్న 97 ఫిజోమీటర్ల పరిశీలనలో 34 ఫిజోమీటర్లలో భూగర్భజలాలు క్షీణిస్తోన్నట్లు భూగర్భజలశాఖ తాజా నివేదికలో వెల్లడైంది. ప్రస్తుతం జిల్లా సగటు నీటిమట్టం 11.67 మీటర్లుగా నమోదైంది. ఈ ఏడాది 473.9 మి.మీకు గాను 37.5 శాతం అధికంగా 651.4 మి.మీ వర్షం కురిసింది. వర్షం రూపంలో 40.94 టీఎంటీలు భూగర్భంలో అందుబాటులో ఉండగా.. అందులో 14.45 టీఎంసీలు వినియోగిస్తున్నారు. ఇంకా 26.49 టీఎంసీలు మిగులు ఉన్నాయి. నార్పల మండలంలో భూగర్భజలాలు అధికంగా వినియోగిస్తుండటంతో డేంజర్ జోన్‌లో ఉంచారు. జిల్లా అంతటా 1,87,610 బోరుబావులు వినియోగిస్తుండగా... కొత్తగా బోరుబావుల తవ్వకాన్ని నిషేధిస్తూ 13 గ్రామాలను వాల్టా పరిధిలోకి చేర్చారు. సగటు నీటి మట్టం 11.67 మీటర్లుగా నమోదైనా... యాడికి మండలం రాయలచెరువు ఫిజోమీటర్‌లో 41.01 మీటర్ల లోతులో కనిపిస్తున్నాయి. అలాగే శెట్టూరు మండలం చెర్లోపల్లి ఫిజోమీటర్‌లో కూడా 38.92 మీటర్లు, మండల కేంద్రం పుట్లూరులో 35.28 మీటర్లు లోతుకు భూగర్భజలాలు క్షీణించాయి. బ్రహ్మసముద్రం, డి.హీరేహాళ్, కళ్యాణదుర్గం, కుందుర్పి, పామిడి, నార్పల, పుట్లూరు, రాయదుర్గం, శెట్టూరు, తాడిపత్రి, యాడికి తదితర 12 మండలాల్లో భూగర్భజలాలు తగ్గుముఖం పట్టినట్లు తాజా నివేదిక వెల్లడిస్తోంది. అయితే గతేడాదితో పోల్చితే ఈ సారి 3.35 మీటర్లు పెరుగుదల ఉన్నట్లు ఆశాఖ డీడీ కె.తిప్పేస్వామి తెలిపారు.... కానీ 34 ప్రాంతాల్లో తగ్గుదల నమోదైందని తెలిపారు.
జిల్లా సగటు నీటిమట్టం11.67 మీటర్లు
ఈ ఏడాది 37.5 శాతంఅదనంగా వర్షాలు
డేంజర్ జోన్‌లో నార్పల
వాల్టా పరిధిలోకి 13 గ్రామాలు