
ప్రశాంతంగా ‘నీట్’
అనంతపురం: వైద్య విద్య కోర్సుల్లో ప్రవేశానికి ఆదివారం నిర్వహించిన జాతీయ అర్హత ప్రవేశ పరీక్ష (నీట్–యూజీ 2025) ప్రశాంతంగా జరిగింది. జిల్లా వ్యాప్తంగా ఆరు పరీక్ష కేంద్రాలు (అనంతపురంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల (బాయ్స్), ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల, ఎస్కేయూ కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్, జేఎన్‌టీయూ–ఏ ఇంజినీరింగ్ కళాశాల, కేఎస్‌ఎన్ ప్రభుత్వ ఉమెన్స్ కళాశాల, ఏపీ మోడల్ జూనియర్ కళాశాల– గుత్తి) ఏర్పాటు చేశారు. 2,613 మందికి గాను, 2,534 మంది (96.97 శాతం) హాజరయ్యారు. 79 మంది గైర్హాజరయ్యారు. పరీక్ష కేంద్రాల వద్ద విద్యార్థులతో పాటు తల్లిదండ్రులు పెద్ద సంఖ్యలో తరలిరావడంతో సందడి కనిపించింది. బాగా రాయాలంటూ తల్లిదండ్రులు తమ పిల్లలకు చెప్పి లోనికి పంపించారు.
తల్లిదండ్రులకు తప్పని ఇక్కట్లు..
నీట్ రాయడానికి అభ్యర్థులతో పాటు వచ్చిన తల్లిదండ్రులకు ఇక్కట్లు తప్పలేదు. ఎస్కేయూ ఇంజినీరింగ్ కళాశాల పరీక్ష కేంద్రం ఎస్కేయూ ప్రధాన ద్వారానికి చాలా దూరంగా ఉంటుంది. తల్లిదండ్రులు అందరినీ ప్రధాన ద్వారం వద్దే ఆపేశారు. ఇంజినీరింగ్ కళాశాల పరిసరాల్లోకి రాకుండా ఆపి ఉంటే బాగుండేది. ఎస్కేయూ ప్రధాన ద్వారం వద్దే ఆపివేయడంతో తల్లిదండ్రులు మండుటెండల్లో రోడ్డుపైనే ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎస్కేయూ ఉద్యోగుల క్వార్టర్స్‌లో ఉండే ప్రొఫెసర్లు, వారికి మంచినీరు ఇచ్చి దాహం తీర్చారు. అతి పెద్ద క్యాంపస్ అయిన ఎస్కేయూ లోపలికి తల్లిదండ్రులను కూడా అనుమతించి ఉంటే క్యాంటీన్ వద్దో.. ఇతరత్రా భవనాల వద్ద కూర్చుని ఉండేవారు. ఉదయం 11 గంటలకు లోపలికి వెళ్లిన అభ్యర్థులు సాయంత్రం 4 గంటల వరకు బయటకు రాలేదు. ఈ క్రమంలో తల్లిదండ్రులు బయటే మండుటెండలో వేచి ఉన్నారు. బిడ్డల భవిష్యత్తు కోసం ఎంత కష్టమైనా పడతామనే రీతిలో తల్లిదండ్రులు అక్కడే నిరీక్షించడం గమనార్హం.
పరీక్ష కేంద్రాల వద్ద పటిష్ట బందోబస్తు
వేర్వేరుగా నిర్వహించిన గ్రూప్–1 మెయిన్స్, నీట్ పరీక్ష కేంద్రాల వద్ద పోలీసులు పటిష్ట భద్రతా చర్యలు చేపట్టారు. ప్రతి పరీక్ష కేంద్రం వద్ద డీఎఫ్‌ఎండీలు, హెచ్‌ఎస్‌ఎండీల ద్వారా పరిశీలించి అభ్యర్థులను పరీక్ష కేంద్రాల్లోకి పంపారు. పరీక్ష కేంద్రాల సమీపంలో జిరాక్స్ షాపులు మూసివేసేలా చర్యలు తీసుకున్నారు.
● నీట్ పరీక్ష కేంద్రాలను కలెక్టర్ వినోద్ కుమార్ తనిఖీ చేశారు. సజావుగా నీట్ పరీక్షలు నిర్వహించిన అధికారులను కలెక్టర్ అభినందించారు.

ప్రశాంతంగా ‘నీట్’