అంతర జిల్లా చైన్‌స్నాచర్ల అరెస్ట్‌ | - | Sakshi
Sakshi News home page

అంతర జిల్లా చైన్‌స్నాచర్ల అరెస్ట్‌

Apr 17 2025 12:34 AM | Updated on Apr 17 2025 12:34 AM

అంతర జిల్లా చైన్‌స్నాచర్ల అరెస్ట్‌

అంతర జిల్లా చైన్‌స్నాచర్ల అరెస్ట్‌

అనంతపురం: ఒంటరిగా వెళ్లే మహిళల్ని టార్గెట్‌ చేసి వారి మెడలోని బంగారు గొలుసులను లాక్కొని ఉడాయించే అంతర జిల్లా చైన్‌స్నాచర్ల ముఠాను పోలీసులు అరెస్ట్‌ చేశారు. వీరి నుంచి మొత్తం రూ.32.40 లక్షల విలువ చేసే 36 తులాల బంగారం, నగదు, మూడు బైక్‌లను స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన వారిలో అనంతపురం శివారులోని రాజీవ్‌ కాలనీకి చెందిన కె.పంపాచారి అలియాస్‌ నరేష్‌, రాయల్‌ నగర్‌కు చెందిన షేక్‌ షాకీర్‌, ప్రియాంకనగర్‌ నివాసి షేక్‌ ఫజిల్‌ అహమ్మద్‌ అలియాస్‌ షేక్‌ ఫజిజ్‌ అహమ్మద్‌, శ్రీ సత్యసాయి జిల్లా నల్లమాడ నివాసి కంబం నాగార్జున అలియాస్‌ చిన్నా ఉన్నారు. బుధవారం డీపీఓలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలను ఎస్పీ పి.జగదీష్‌ వెల్లడించారు.

అందరూ 24 నుంచి 30 ఏళ్ల లోపు వారే

పట్టుబడిన నిందితులందరూ 24 నుంచి 30 ఏళ్ల లోపు వారే కావడం గమనార్హం. కె.పంపాచారి కార్పెంట్‌ వృత్తితో పాటు డ్రైవింగ్‌ చేస్తూ కుటుంబాన్ని పోషించుకునేవాడు. పేకాట, క్రికెట్‌ బెట్టింగ్‌లకు అలవాటు పడి సంపాదన మొత్తం వ్యసనాలకే ఖర్చు పెట్టేవాడు. ఇతనికి నాలుగు నెలల క్రితం కంబం నాగార్జున పరిచయమయ్యాడు. నాగార్జున సొంతూరు శ్రీసత్యసాయి జిల్లా నల్లమాడ కాగా, ఏడాదిన్నర క్రితం కుటుంబంతో సహా అనంతపురానికి వలస వచ్చి సుఖ్‌దేవ్‌నగర్‌లో నివాసముంటున్నాడు. డ్రైవర్‌గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషించుకునేవాడు. పంపాచారి పరిచయమైన తర్వాత ఇద్దరూ కలసి పేకాట, ఆన్‌లైన్‌ జూదం ఆడుతూ సంపాదన మొత్తం పోగొట్టుకుని అప్పుల పాలయ్యారు. రాయల్‌ నగర్‌కు చెందిన షేక్‌ షాకీర్‌... కార్పెంటర్‌గా పనిచేసేవాడు. ఈ క్రమంలో సొంతంగా ఓ ఫర్నీచర్‌ షాప్‌ ఏర్పాటు చేసుకుని అప్పుల పాలయ్యాడు. అప్పులు తీర్చే మార్గం కోసం అన్వేషిస్తుండగా పంపాచారి, నాగార్జున పరిచయమయ్యారు. ముగ్గురు కలసి వ్యక్తిగత అవసరాలకు, అప్పులు తీర్చేందుకు చైన్‌స్నాచింగ్‌లకు సిద్ధమయ్యారు. అనంతరం వీరందరూ కలసి బృందాలుగా విడిపోయి చైన్‌స్నాచింగ్‌కు పాల్పడేవారు. ప్రైవేట్‌ వాహన డ్రైవర్‌గా పనిచేస్తున్న షేక్‌ ఫజిల్‌ అహమ్మద్‌ సైతం ఆన్‌లైన్‌ బెట్టింగ్‌, పేకాట తదితర వ్యసనాలకు బానిసై అప్పుల పాలయ్యాడు. అప్పులు ఇచ్చిన వారి నుంచి ఒత్తిళ్లు ఎక్కువ కావడంతో పాటు ఇటీవల పెళ్లి సంబంధం కూడా ఖాయమైంది. పెళ్లి ఖర్చులకు డబ్బు లేకపోవడంతో చైన్‌స్నాచర్‌గా మారాడు.

ఒంటిరిగా వెళ్లే మహిళలే లక్ష్యంగా..

పంపాచారి ద్విచక్ర వాహనంపై ఒక్కడే వెళుతూ శివారు కాలనీలు, నిర్మానుష్య ప్రాంతాల్లో ఒంటరిగా వెళ్తున్న మహిళల మెడలోని బంగారు నగలను లాక్కొని అదే టూవీలర్‌పై ఉడాయించేవాడు. 2023 నుంచి కురుగుంట, మన్నీల, రాప్తాడు, అనంతపురంలోని కళ్యాణదుర్గం రోడ్డు, గణేష్‌ నగర్‌, లలితానగర్‌, ఒకటో రోడ్డు, తదితర ప్రాంతాల్లో 10 చైన్‌ స్నాచింగ్‌లు చేశాడు. అనంతరం షేక్‌ షాకీర్‌తో కలసి బైక్‌పై వెళుతూ కళ్యాణదుర్గం రోడ్డు, ద్వారకా విల్లాస్‌లో రెండు స్నాచింగ్‌లు, కంబం నాగార్జునతో కలసి హెచ్చెల్సీ రోడ్డు, స్టాలిన్‌ నగర్‌, బుక్కరాయసముద్రం, బి.కొత్తపల్లి గ్రామాల్లో నాలుగు స్నాచింగ్‌లు చేశాడు. మొత్తం 16 కేసుల్లో పంపాచారి నిందితుడు. ఇందులో రెండు కేసుల్లో షేక్‌ షాకీర్‌, నాలుగు కేసుల్లో కంబం నాగార్జున నిందితులుగా ఉన్నారు. షేక్‌ ఫజిల్‌ అహమ్మద్‌ ఎవరూ గుర్తుపట్టకుండా తలకు ఎరుపు రంగు క్యాప్‌ పెట్టుకుని, ముఖానికి ఖర్చీఫ్‌ కట్టుకుని చైన్‌స్నాచింగ్‌లకు పాల్పడేవాడు. అనంతపురంలోని శ్రీశ్రీ నగర్‌, హెచ్చెల్సీపై సచివాలయ మహిళా ఉద్యోగిని మెడలో ఉన్న బంగారు చైన్‌ అపహరణ, ఇతర మూడు కేసుల్లో నిందితుడుగా ఉన్నాడు. నిందితులు నలుగురూ వేర్వేరుగా పట్టుబడ్డారు. చైన్‌స్నాచర్ల అరెస్ట్‌లో చొరవ చూపిన సీఐలు ఎన్‌.శేఖర్‌, కె.సాయినాథ్‌, ఇస్మాయిల్‌, జయపాల్‌రెడ్డి తదితరులను ఎస్పీ అభినందించారు.

రూ.32.40 లక్షల విలువ చేసే 36 తులాల బంగారం, నగదు, మూడు బైక్‌ల స్వాధీనం

వ్యసనాలతో అప్పులపాలై చైన్‌స్నాచర్లుగా మారిన యువకులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement