పరిస్థితి దారుణంగా ఉంది
అనంతపురం అగ్రికల్చర్: రాష్ట్రంలో మరెక్కడా లేని విధంగా ఉమ్మడి అనంతపురం జిల్లాలో చీనీ తోటలు ఉన్నాయి. అనంతపురం జిల్లాలో 93 వేల ఎకరాలు, శ్రీ సత్యసాయి జిల్లాలో 37,250 ఎకరాల భారీ విస్తీర్ణంలో చీనీ పంట సాగవుతోంది. వాటి ద్వారా ఏటా 7.20 లక్షల టన్నుల మేర దిగుబడి వస్తోంది. ఏటా సరాసరి రూ.2,000 కోట్ల నుంచి రూ.2,200 కోట్ల టర్నోవర్ ఉన్నట్లు ఉద్యానశాఖ గణాంకాలు చెబుతున్నాయి. అనంతపురం జిల్లాలోని గార్లదిన్నె మండలంలో 18 వేల ఎకరాలు, యల్లనూరు 11,296, కూడేరు 9,300, పామిడి 5,300, నార్పల 5,200, పుట్లూరు 5 వేలు, ఆత్మకూరు 4,200, అనంతపురం 3,900, పెద్దపప్పూరు 3,500 ఎకరాల్లో చీనీ తోటలు ఉన్నాయి. శ్రీ సత్యసాయి జిల్లాలో తాడిమర్రి, బత్తలపల్లి, ధర్మవరం, ముదిగుబ్బ, కనగానపల్లి, చెన్నేకొత్తపల్లి తదితర మండలాల్లో చీనీ అత్యధికంగా సాగులో ఉంది.
ఢిల్లీ, ఉత్తరాది రాష్ట్రాలకు ఎగుమతి..
ఉమ్మడి జిల్లాలో పండించే చీనీలో 70 నుంచి 80 శాతం వరకు ఢిల్లీలో ఉన్న అజాద్‌పూర్ మార్కెట్‌కు, ఆ తర్వాత రాజస్థాన్, గుజరాత్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాలకు ఎగుమతి అవుతుంది. అయితే ఈ సారి మహారాష్ట్ర, తెలంగాణ నుంచి ఎక్కువ దిగుబడి రావడంతో వ్యాపారులు అక్కడికి వెళుతున్నట్లు చెబుతున్నారు. ఈ క్రమంలో ఢిల్లీ, పరిసర ప్రాంతాల మార్కెట్లకు సరుకు విపరీతంగా వెళుతుండటంతో సమస్య ఉత్పన్నమవుతోందని మార్కెట్‌యార్డు ఉన్నతశ్రేణి సెక్రటరీ కె.గోవిందు తెలిపారు. ఇటీవల జిల్లా నుంచి అక్కడకు వెళ్లిన 50 నుంచి 70 లారీల సరుకు ఇంకా అన్‌లోడ్ కాలేదని, దీంతో ధరలు పెరగడం లేదని పేర్కొన్నారు.
గతంలో ఎన్నడూ లేని విధంగా..
సాధారణంగా మార్చి, ఏప్రిల్, మే నెలల్లో గరిష్ట ధరలు పలికేవి. కానీ, ఈసారి అందుకు భిన్నమైన పరిస్థితి నెలకొంది. ధరలు పెరగడం అటుంచి తగ్గుదల కనిపిస్తుండటంతో అన్నదాతలు దిక్కులు చూస్తున్నారు. ఏప్రిల్‌లో టన్ను రూ.40 వేలకు పైగా పలకాల్సివుండగా... గత రెండు నెలలుగా టన్ను రూ.20 వేల నుంచి రూ.25 వేలకు మించి పలకడం లేదు. అనంతపురం వ్యవసాయ మార్కెట్‌యార్డుకు ఇటీవల నిత్యం 1,000 నుంచి 1,500 టన్నుల సరుకు వస్తోంది. ఈ క్రమంలో శనివారం టన్ను గరిష్ట ధర రూ.20 వేల లోపే పలికింది. సరాసరి ధర రూ.13 వేలు మాత్రమే పలకడంతో రైతుల్లో ఆందోళన పెరుగుతోంది. దీనికి తోడు శనివారం మార్కెట్‌యార్డులో జీవాల సంత ఉండటంతో చీనీ అమ్మకాలకు తీవ్ర ఇబ్బంది ఎదురైంది. చాలా వాహనాల్లోని సరుకును కిందికి దించి అమ్మకాలు చేసేందుకు కూడా వీలు లేకుండా పోయింది. ఇలా రోజురోజుకు కష్టాలు ఎక్కువ అవుతుండటంతో చీనీ రైతులు భారీ నష్టాలు చవిచూస్తున్న పరిస్థితులు నెలకొన్నాయి.
‘అనంత’ రైతులకు ఒకప్పుడు లాభాల తీపి పంచిన చీనీ ఇప్పుడు చేదెక్కింది. మంచి ధర కోసం వారాలు, నెలల తరబడి కాయలు కోయకుండా ఎదురుచూసినా ఫలితం కానరాకపోవడంతో రైతుల్లో ఆందోళన నెలకొంది. మార్కెటింగ్ పరిస్థితి దారుణంగా ఉన్నా కూటమి సర్కారు నుంచి స్పందన లేకపోవడంతో రైతుల ఆవేదన వర్ణనాతీతంగా మారింది.
ధరలు మరింత పతనం
గతంలో ఎన్నడూ లేని విధంగా
దారుణ పరిస్థితులు
రైతుల్లో తీవ్ర ఆందోళన
గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ సారి చీనీ రైతుల పరిస్థితి దారుణంగా ఉంది. రంజాన్, ఉగాది, హోలీ పండుగలు అన్నీ వెళ్లినా... ధరలు మాత్రం పెరగడం లేదు. తోటల్లోనే టన్ను రూ.25 వేలకు మించి అడగడం లేదు. దానికి డబుల్ సూట్ ఇవ్వాల్సి ఉంటుంది. ఇప్పటికే నెల పాటు కాయలు కోయకుండా ధరల కోసం ఎదురుచూసినా ఫలితం కానరాలేదు. నాకు ఏడెకరాల చీనీ తోట ఉంది. దిగుబడి బాగానే ఉన్నా ధరలు చూస్తే ఏం చేయాలో అర్థం కావడం లేదు. టన్ను రూ.40 వేలు అటుఇటుగా పలికితే తప్ప గిట్టుబాటు కాదు. గతంలో కన్నా ఈ సారి చీడపీడల తాకిడి ఎక్కువ కావడంతో పురుగుల మందుల ఖర్చు బాగా పెరిగింది. – కుళ్లాయిరెడ్డి, చీనీ రైతు,
కునుకుంట్ల గ్రామం, తాడిమర్రి మండలం
పరిస్థితి దారుణంగా ఉంది
పరిస్థితి దారుణంగా ఉంది
పరిస్థితి దారుణంగా ఉంది


