
‘డైట్’ అధ్యాపకుల పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం
అనంతపురం ఎడ్యుకేషన్: శ్రీసత్యసాయి జిల్లా బుక్కపట్నంలోని విద్యా శిక్షణ సంస్థ (డైట్)లో ఖాళీగా ఉన్న అధ్యాపకుల పోస్టులకు అర్హులైన వారి నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. డిప్యూటేషన్ పద్దతిలో పని చేసేందుకు ఆసక్తి ఉన్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ మేరకు డీఈఓ ప్రసాద్‌బాబు మంగళవారం ఓ ప్రకటన విడుదల చేశారు. ఈ నెల 10వ తేదీలోపు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. పూర్తి వివరాలు https://deo ananthapuramu.blogspot.com/ వెబ్‌సైట్‌లో పొందుపరిచారని, మరింత సమాచారానికి డైట్ ప్రిన్సిపాల్ లేదా అనంతపురం డీఈఓ కార్యాలయంలో సంప్రదించాలని కోరారు.
ఆత్మకూరు హెచ్‌ఎంపై
కేసు నమోదు
ఆత్మకూరు: పరీక్ష కేంద్రంలో కేజీబీవీ పాఠశాల విద్యార్థిని శ్రావణిని కర్రతో కొట్టి ఆమె భుజపుటెముక విరిగేందుకు కారణమైన ఆత్మకూరు జెడ్పీహెచ్‌ఎస్ హెచ్‌ఎం శ్రీనివాసప్రసాద్‌పై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. మంగళవారం పదో తరగతి పరీక్షకు సంబంధించి ప్రశ్న పత్రాలను తీసుకెళ్లేందుకు పీఎస్‌కు చేరుకున్న ఆయనను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
అనంతలో
చైన్‌స్నాచర్ బరితెగింపు
అనంతపురం: నగరంలో ఓ చైన్ స్నాచర్ రెచ్చిపోయాడు. సామాజిక పించన్ల పంపిణీకి స్కూటీలో బయలుదేరిన ఓ సచివాలయ ఉద్యోగిని వెంటాడి, ఆమె మెడలోని బంగారం చైన్‌ను బలవంతంగా లాక్కెళ్లాడు. వివరాలు.. అనంతపురం నగరంలోని 71వ సచివాలయంలో హెల్త్ సెక్రెటరీగా పనిచేస్తున్న శకుంతల మంగళవారం ఉదయమే సామాజిక పింఛన్ల పంపిణీకి స్కూటీలో బయలుదేరారు. బైపాస్ నుంచి హెచ్చెల్సీ పక్కనే ఉన్న దారిలో వెళుతున్న ఆమెను గమనించిన ఓ యువకుడు వెంబడిస్తూ నిర్మానుష్య ప్రాంతంలో తన ద్విచక్ర వాహనాన్ని అడ్డుపెట్టి అటకాయించాడు. హఠాత్పరిణామంతో ఆమె తేరుకునేలోపు మెడలోని బంగారం చైన్‌ను బలవంతంగా లాగేశాడు. దీంతో చైన్ రెండు ముక్కలైంది. తన చేతికి అందిన సగం చైన్‌తో యువకుడు అక్కడి నుంచి శరవేగంగా ఉడాయించాడు. ఘటనపై బాధితురాలు మూడో పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు.