
‘పరిటాల’ అండతోనే భూ వివాదం
అనంతపురం ఎడ్యుకేషన్: ‘పరిటాల కుటుంబం అండతోనే ఆత్మకూరు మండలం వడ్డుపల్లిలో 26 సెంట్ల భూ వివాదంలోకి కొత్తపల్లి మాజీ సర్పంచ్ మోహన్‌రెడ్డి జోక్యం చేసుకుని రూ. 60 లక్షలు డిమాండ్ చేశాడు. అంతమాత్రాన అతనిపై దాడి చేయడం కరెక్ట్ కాదు. తనది కాని భూమికి ఫేక్ డాక్యుమెంట్లు సృష్టించుకుని అందులోకి వెళ్లడం ఆయనదీ కరెక్ట్ కాదు’ అని రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి అన్నారు. జిల్లా వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రెండు రోజుల క్రితం కొత్తపల్లి మోహన్‌రెడ్డిపై జరిగిన దాడి కేసులో అరైస్టెన చింతపంటి సుధాకరరెడ్డి, దివాకర్‌రెడ్డి పోలీసు విచారణలో భూ వివాదమే ఇందుకు కారణంగా స్పష్టం చేశారన్నారు. గతంలో చింతపంటి సుధాకర్‌రెడ్డి, దివాకర్‌రెడ్డి ఆత్మకూరు మండలం వడ్డుపల్లిలో 26 సెంట్ల భూమిని కొనుగోలు చేశారన్నారు. శాశ్వత విక్రయఖరారు నామా రాయించుకున్నారని గుర్తు చేశారు. ఇదే భూమిని ఇటీవల మరో వ్యక్తికి అప్పట్లో శాశ్వత విక్రయఖరారు నామా చేసిన వారి వారసులు రిజిస్ట్రేషన్ చేయించారన్నారు. ఇది పూర్తిగా చట్ట విరుద్ధమని, చట్టరీత్యా అది చెల్లుబాటు కూడా కాదన్నారు. ఈ డాక్యుమెంట్ ఆధారంగా భూ వివాదంలోకి కొత్తపల్లి మోహన్‌రెడ్డి ప్రవేశించాడన్నారు. ఇందుకు సంబంధించి ఘటన జరిగిన మరుసటి రోజు వేకువజామునే నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారన్నారు. అయితే వాస్తవాలు గుర్తించకుండా మోహన్‌రెడ్డిపై దాడి వెనుక ఎవరున్నా చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే పరిటాల సునీత మాట్లాడుతున్నారని, తాను ఫోన్ చేసే వరకూ ఎస్పీ, డీఎస్పీ పట్టించుకోలేదని ఆరోపణలు చేస్తుండడం ఆమె అవివేకానికి నిదర్శనమన్నారు. కేవలం పరిటాల సునీత అండ చూసుకునే మోహన్‌రెడ్డి ఈ దుశ్చర్యకు పాల్పడ్డాడన్నారు.
వంద మంది రెడ్లను చంపిన చరిత్ర
కమ్మోల్లు, కాపోల్లు కలసిమెలసి ఉంటూ మామా.. చిన్నాన్న అంటూ సంబంధాలను కలుపుకుని పోయే మనస్తత్వం కొత్తపల్లి గ్రామ ప్రజలదని ప్రకాష్‌రెడ్డి అన్నారు. అలాంటి గ్రామంలో రెడ్లను రెండు గుంపులుగా చేసి తన స్వార్థానికి వారి మధ్య వర్గ కక్షలకు సునీత ఆజ్యం పోస్తున్నారని మండిపడ్డారు. సునీత భర్త పరిటాల రవీంద్ర నియోజకవర్గంలోని వంద మంది రెడ్లను చంపిస్తే.. అదే నియోజకవర్గంలో రెడ్ల మధ్య ప్రస్తుతం ఫ్యాక్షన్ చిచ్చును సునీత రాజేస్తోందని ధ్వజమెత్తారు. రాప్తాడులో ప్రసాదరెడ్డి హత్య వెనుక సూత్రధారి సునీతనేనని ఆగ్రహం వ్యక్తం చేశారు. సునీతకు, ఆమె కుటుంబానికి కబ్జాల చరిత్ర ఉందని, పదిమందికి సాయం చేసే మనస్తత్వం ప్రకాష్‌రెడ్డిదని గుర్తించాలన్నారు. ఇప్పటి వరకూ కేవలం మహిళ అని గౌరవించి మాట్లాడుతున్నానన్నారు. ఆమె మాదిరిగా వ్యక్తిగత దూషణలకు తాను పోలేదని, అలా మొదలుపెడితే ఆమె కంటే బాగా తిట్టగలనన్నారు. సమావేశంలో రాప్తాడు వైస్ ఎంపీపీ రామాంజనేయులు, యూత్ మాజీ కన్వీనర్ చిట్రెడ్డి సత్యానారాయణరెడ్డి, కొత్తపల్లి గ్రామస్తులు బాలకృష్ణారెడ్డి, రఘునాథరెడ్డి, వెకంటరామిరెడ్డి, తాతిరెడ్డి పాల్గొన్నారు.
అంతమాత్రాన కొత్తపల్లి మోహన్‌రెడ్డిపై దాడి చేయడం సబబు కాదు
పది మందికి సాయం చేసే మనసు ప్రకాష్‌రెడ్డిది
ఎమ్మెల్యే పరిటాల సునీతపై మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి ఫైర్