కన్న తండ్రిపై వేట కొడవలితో దాడి
అక్కడికక్కడే మృతి చెందిన సుంకప్ప
రాయదుర్గం: ఆస్తి కోసం ఓ కుమారుడు బరితెగించాడు. వేటకొడవలితో కన్న తండ్రిపై దాడి చేసి హతమార్చాడు. పోలీసులు తెలిపిన మేరకు... రాయదుర్గం మండలం టి.వీరాపురం గ్రామానికి చెందిన వాల్మీకి సుంకప్ప (68), గంగమ్మ దంపతులకు నలుగురు కుమార్తెలు, ఓ కుమారుడు ఉన్నారు. దేవుడి మహిమతో పుట్టాడని కుమారుడికి వన్నూర్‌స్వామిగా పేరుపెట్టారు. అమ్మాయిలకు పెళ్లిళ్లు చేసి అత్తారింటికి పంపారు. పూర్వీకులు సంపాదించిన 2 ఎకరాల ఆస్తి సుంకప్ప పేరుపైనే ఉంది. దీంతో ఆస్తిని తన పేరున బదలాయించాలంటూ కొంత కాలంగా తండ్రిని కుమారుడు వేధిస్తూ వచ్చాడు.
అయితే ఇందుకు తండ్రి అంగీకరించకపోవడంతో భార్యతో కలసి వేరు కాపురం పెట్టాడు. మంగళవారం తన తండ్రి ఇంటికి చేరుకున్న వన్నూర్‌స్వామి ఆస్తి కోసం గొడవ పడ్డాడు. ఇద్దరి మధ్య మాటామాట పెరిగింది. విచక్షణ కోల్పోయిన వన్నూర్‌స్వామి అప్పటికే తన వద్ద సిద్ధంగా ఉంచుకున్న వేటకొడవలి తీసి తండ్రిపై దాడి చేశాడు. ఘటనలో సుంకప్ప అక్కడికక్కడే మృతి చెందాడు. అనంతరం పోలీస్ స్టేషన్‌కు చేరుకుని తన తండ్రిని హత్య చేసినట్లుగా వన్నూర్ స్వామి అంగీకరిస్తూ లొంగిపోయాడు. ఘటనా స్థలాన్ని సీఐ జయానాయక్ పరిశీలించి కేసు నమోదు చేశారు.