
ఎస్‌బీఐ ఏటీఎం సెంటరులో అగ్ని ప్రమాదం
● ఏసీ సిలిండర్లు, బ్యాటరీలు పేలడంతో ఘటన
● పూర్తిగా దగ్ధమైన ఏటీఎం సెంటరు
రాయదుర్గంటౌన్: పట్టణంలోని బళ్లారి రోడ్డు సోమా పాండు కాంప్లెక్స్‌లోని ఎస్‌బీఐ ఏటీఎం సెంటరులో జరి గిన అగ్ని ప్రమాదంతో భారీగా ఆస్తినష్టం వాటిల్లింది. ఈ ఘటన సోమవారం అర్ధరాత్రి దాటిన తర్వాత జరిగింది. ఘటన సమయంలో ఏటీఎం సెంటరు సెక్యూరిటీ గార్డు శ్రీనివాసులు పెద్ద శబ్దం విని లోపల వెళ్లేందుకు ప్రయత్నించాడు. క్షణంలోనే మరో భారీ శబ్దంతో ఏసీ పేలి మంటలు శరవేగంగా వ్యాపించాయి. విషయాన్ని వెంటనే అగ్నిమాపక శాఖ అధికారులకు, అక్కడే పై అంతస్తులో నివాసం ఉంటున్న భవన యజమానికి చేరవేశాడు. హుటాహుటిన చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది గంట పాటు శ్రమించి మంటలను అదుపు చేశారు. అప్పటికే ఏటీఎం సెంటర్ పూర్తిగా కాలిపోయింది. అదే కాంప్లెక్స్‌లో పార్కింగ్‌లో ఉంచిన నాలుగు ద్విచక్ర వాహనాలతో పాటు ఒక సైకిల్ దగ్ధమయ్యాయి. ఏటీఎం సెంటరుకు ఆనుకుని ఉన్న రూముల్లో మంటల వ్యాప్తితో నష్టం వాటిల్లింది. సుమ ఎంటర్‌ప్రైజెస్‌లో ఎలక్ట్రిక్ వస్తువులు దెబ్బతిన్నట్లు యజమానులు గోపి, విజయ్ తెలిపారు. దుస్తుల షాపులో రెడీమేడ్ దుస్తులు కాలిపోయినట్లు బాధితుడు పవన్‌కుమార్ వాపోయాడు. ఏటీఎం వెనుక భాగంలోని ఫొటో స్టూడియోలోనూ నష్టం వాటిల్లినట్లు బాధితుడు శ్రీనివాసులు తెలిపాడు. కాగా.. ఏటీఎంలో డబ్బులు కాలిపోయాయా, లేదా అనే విషయం తెలియరాలేదు. ఈ విషయమై ఎస్‌బీఐ బ్రాంచ్ మేనేజర్ మృత్యుంజయతో ఆరా తీయగా.. ఏటీఎం లాక్ తెరిచి పరిశీలించాల్సి ఉందని, నిపుణులకు సమాచారం అందజేశామని చెప్పారు. మొత్తమ్మీద ఈ ఘటనలో రూ.20 లక్షలకు పైగా నష్టం వాటిల్లినట్లు ప్రాథమిక అంచనా. నష్టంపై యజమానులతో వివరాలు సేకరిస్తున్నట్లు లీడింగ్ ఫైర్‌మెన్ మల్లారెడ్డి తెలిపారు.