
పేదలపై సీఎం చంద్రబాబు కక్ష కట్టారు. అదిగో ఇదిగో అంటూ ఇప
అనంతపురం: పేద పిల్లలకూ విదేశాల్లో ఉన్నత చదువులు అందించాలనే గొప్ప ఆలోచనతో గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ‘జగనన్న విదేశీ విద్యా దీవెన’ పథకాన్ని అమలు చేసింది. 2022–23, 2023–24 విద్యా సంవ త్సరంలో మొత్తం రూ.1.47 కోట్లను జిల్లాకు చెందిన విద్యార్థులకు అందజేసింది. అయితే, గతేడాది విదేశాలకు వెళ్లిన విద్యార్థులకు నాలుగు విడతల్లో ఫీజు మొత్తాన్ని అందించాల్సిన తరుణంలో కూటమి సర్కారు రావడంతో పరిస్థితి ఒక్కసారిగా తలకిందులైంది.
పైసా విదల్చలేదు..
అధికారం చేపట్టి 9 నెలలు అయినప్పటికీ పైసా విదల్చకుండా కూటమి సర్కారు లక్ష్యాన్ని నీరుగారుస్తోంది. గత ప్రభుత్వ హయాంలో విదేశాలకు వెళ్లిన విద్యార్థులకు డబ్బులు ఇవ్వడం ఆపేసింది. కొత్తగా విదేశాలకు వెళ్లిన విద్యార్థులు చేసుకున్న దరఖాస్తులను సైతం పట్టించుకోవడం లేదు. ప్రభుత్వ సాయానికి గతేడాది జనవరి నుంచి పేద విద్యార్థులు పెద్ద ఎత్తున దరఖాస్తు చేసుకున్నారు. వాటిలో కొన్ని దరఖాస్తుల పరిశీలన పూర్తికాగా, మరికొందరికి ఇంటర్వ్యూలు సైతం నిర్వహించారు. ఆ తర్వాత ఎన్నికల కోడ్ పేరుతో నిధుల విడుదలను నిలిపివేశారు. ప్రభుత్వ సాయం అందుతుందన్న ఆశతో ఇంటర్వ్యూ పూర్తయిన చాలా మంది విద్యార్థులు అప్పులు చేసి మరీ విదేశాలకు వెళ్లారు. నెలలు గడుస్తున్నా సాయం అందించే విషయంపై స్పష్టత రాకపోవడంతో ఆందోళనకు గురవుతున్నారు. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్‌కు విద్యార్థుల తల్లిదండ్రులు వినతి పత్రాలు అందించినా ఫలితం కానరాకపోవడం గమనార్హం.
గతంలోనూ ఇంతే..
గతంలో చంద్రబాబు నేతృత్వంలో ఏర్పడిన టీడీపీ ప్రభుత్వంలోనూ అగ్రవర్ణ పేదలను విస్మరించారు. మిగిలిన వారికి కూడా కేవలం రూ.15 లక్షల చొప్పున సాయం అందించి చేతులు దులుపుకున్నారు. అదే జగన్ సర్కార్ ఒక్కొక్కరికి రూ.కోటి నుంచి రూ.1.25 కోట్ల వరకు సాయం అందించింది. అగ్రవర్ణ పేదలతో పాటు కాపులు, ఎస్సీ, ఎస్టీ , బీసీ, మైనార్టీలకు ‘జగనన్న విదేశీ విద్యా దీవెన’ పథకం ద్వారా విదేశాల్లో చదువులకు ఊతమిచ్చారు. ప్రపంచంలో టాప్–50 క్యూఎస్ ర్యాంకింగ్ సాధించిన యూనివర్సిటీల్లో సీటు పొందిన విద్యార్థులకు ఈ పథకాన్ని వర్తింపజేశారు. ఎంపికైన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థులు ఒక్కొక్కరికి గరిష్టంగా రూ.1.25 కోట్ల వరకు, కాపు, ఈబీసీ విద్యార్థులకు రూ.కోటి వరకు ఆర్థిక సాయం అందించారు. నాలుగు విడతల (సెమిస్టర్)లో ఈ మొత్తాన్ని విద్యార్థుల బ్యాంకు ఖాతాలకు జమ చేశారు. విద్యార్థుల ప్రయాణానికి అవసరమైన ఖర్చులను సైతం ప్రభుత్వమే చెల్లించింది. పీజీ,పీహెచ్‌డీ కోర్సులతో పాటు విదేశాల్లో ఎంబీబీఎస్ కోర్సులకూ పథకాన్ని వర్తింపజేశారు. అటువంటి గొప్ప పథకాన్ని నీరుగార్చేలా కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తుండడం పట్ల సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
పోర్టల్ తెరుచుకోవడం లేదు
ప్రభుత్వ సాయం అందుతుందని మా అబ్బాయిని విదేశీ చదువుకు పంపించా. కూటమి ప్రభుత్వం వచ్చాక విదేశీ విద్యకు సాయం అందించలేదు. కనీసం మా దరఖాస్తు ఏమైందో తెలుసుకుందామంటే జ్ఞానభూమి పోర్టల్ తెరుచుకోవడం లేదు. సమాధానం చెప్పే నాథుడే లేడు. సాయం అందించకపోతే అబ్బాయి చదువు కోసం అప్పులు చేసి అవస్థలు పడక తప్పదు.
– విజయభాస్కర్, చిరుద్యోగి, అనంతపురం
ఇస్తారో లేదో చెప్పాలి?
మా అమ్మాయిని విదేశాల్లో డాక్టర్ చదివిద్దామని సాయం కోసం దరఖాస్తు చేసి నాలుగు నెలలు దాటింది. ఆ దరఖాస్తు ఏమైందో తెలియదు. విదేశీ విద్యా దీవెన పథకాన్ని కూటమి ప్రభుత్వం కొనసాగి స్తుందా.. లేదా.. అనే అంశంపై స్పష్టత లేదు. అసలు సాయం అందిస్తారో లేదో చెబితే.. మా తిప్పలు మేం పడతాం.
– ఓబుళ రెడ్డి, మాజీ ఆర్మీ ఉద్యోగి,
శ్రీ సత్యసాయి జిల్లా
పైసా విదల్చని కూటమి సర్కారు
పేద బిడ్డల పట్ల
నిర్దయగా వ్యవహరిస్తున్న వైనం
ఇప్పటికే విదేశాలకు వెళ్లిన
వారికీ చెల్లింపులు బంద్
విద్యార్థులు, తల్లిదండ్రుల్లో
తీవ్ర ఆందోళన
ఎన్నికల ముందు వచ్చిన
దరఖాస్తులు బుట్టదాఖలే?