అనంతపురం అర్బన్: వేతన బకాయిలు చెల్లించాలనే డిమాండ్‌తో ఏప్రిల్ 6వ తేదీ అర్ధరాత్రి నుంచి శ్రీరామరెడ్డి నీటి సరఫరా పథకంలో పనిచేస్తున్న కార్మికులు నిరవధిక సమ్మె చేపట్టనున్నట్లు నీలకంఠాపురం శ్రీరామరెడ్డి నీటి సరఫరా స్కీమ్ కార్మిక సంఘం గౌరాధ్యక్షుడు ఓబుళు స్పష్టం చేశారు. ఈ మేరకు సోమవారం కలెక్టరేట్‌లోని రెవెన్యూభవన్‌లో జాయింట్ కలెక్టర్ శివ్‌నారాయణ్ శర్మను ఓబుళు, సంఘం నాయకులు కలసి సమ్మె నోటీసు అందజేశారు. కార్మికులకు ఆరునెలలుగా వేతనాలు చెల్లించకపోవడంతో కుటుంబపోషణ భారమై అప్పుల పాలవుతున్నారన్నారు. సకాలంలో కంతులు చెల్లించలేకపోవడంతో కొత్తగా అప్పులు కూడా పుట్టడం లేదన్నారు. దసరా, నూతన సంవత్సరం, సంక్రాంతి పండుగలకూ కార్మికులు పస్తులుండాల్సి వచ్చిందన్నారు. ఈ నెల 3వ తేదీలోపు వేతన బకాయిలు చెల్లిస్తామని ఫిబ్రవరి 2న సమ్మె నోటీసు ఇచ్చిన సందర్భంలో ఆర్‌డబ్ల్యూఎస్ అధికారులు, కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబు స్పష్టమైన హామీని ఇచ్చారన్నారు. అయినా నేటికీ బకాయిలు చెల్లించని కారణంగా సమ్మె బాట పట్టాల్సి వచ్చిందన్నారు. కార్మికులకు సంబంధించి ప్రధానమైన 12 డిమాండ్లను ఏప్రిల్ 6వ తేదీలోపు పరిష్కరించకుంటే అదే రోజు అర్ధరాత్రి నుంచి నిరవధిక సమ్మెలోకి వెళతామని స్పష్టం చేశారు. కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా ప్రధానకార్యదర్శి నాగేంద్రకుమార్, సంఘం కార్యదర్శి రాము, కోశాధికారి వన్నూరుస్వామి, నాయుడు ఎర్రిస్వామి ఉన్నారు.