అనంతపురం అర్బన్: డిమాండ్ల సాధనకు విద్యుత్ మీటర్ రీడర్లు ఆందోళన బాట పట్టారు. స్మార్ట్ మీటర్ల పేరుతో తమను రోడ్డున పడేయడం సరైంది కాదని, ప్రత్యామ్నాయ ఉపాధి చూపాలంటూ ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు రాజేష్‌గౌడ్ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట సోమవారం ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా రాజేష్ మాట్లాడుతూ... విద్యుత్ శాఖను నమ్ముకుని మీటర్ రీడర్లు కొన్నేళ్లుగా పనిచేస్తున్నాన్నారు. స్మార్ట్ మీటర్లు ఏర్పాటు చేయదలిస్తే మీటర్ రీడర్ల విద్యార్హతను బట్టి విద్యుత్‌శాఖలో ఉద్యోగాలు ఇవ్వాలన్నారు. కార్యక్రమంలో ఏఐటీయూసీ నగర ప్రధాన కార్యదర్శి కృష్ణుడు, మీటర్ రీడర్ల సంఘం రాష్ట్ర కోశాధికారి రమేష్‌బాబు, జిల్లా ప్రధాన కార్యదర్శి రాంభీమప్ప, నాయకులు, సలీంబాషా, రామకృష్ణ, విజయ్, భరత్, మీటర్ రీడర్లు పాల్గొన్నారు.
పారా గేమ్స్‌లో ప్రతిభ
అనంతపురం: న్యూఢిల్లీలో జరుగుతున్న ఖేలో ఇండియా పారా గేమ్స్‌లో జిల్లాకు చెందిన ఇద్దరు క్రీడాకారులు పతకాలు సాధించారు. షాట్‌ఫుట్ (ఎఫ్–56) విభాగంలో కందుకూరుకు చెందిన సాకే బాబు సిల్వర్ మెడల్ దక్కించుకోగా, పామిడి మండలం ఎద్దులపల్లికి చెందిన నీలం పల్లవి షాట్‌పుట్ (ఎఫ్–11) విభాగంలో కాంస్య పతకం కై వసం చేసుకుంది. ఈ సందర్భంగా వారిని పారా అసోసియేషన్ అనంతపురం జిల్లా సెక్రెటరీ ఎన్.శ్రీనివాసులు అభినందించారు.
లారీల ఢీ – డ్రైవర్ దుర్మరణం
కనగానపల్లి: మండలంలోని పర్వతదేవరపల్లి సమీపంలో 44వ జాతీయ రహదారిపై రెండు లారీలు ఢీ కొన్నాయి. ఘటనలో నంద్యాల జిల్లా బనగానపల్లి మండలం పెదరాజుపల్లి గ్రామానికి చెందిన డ్రైవర్ ప్రసాద్ (45) దుర్మరణం పాలయ్యాడు. పోలీసుల వివరాల మేరకు... సోమవారం తెల్లవారుజామున అనంతపురం వైపు నుంచి బెంగుళూరు వైపు వెళుతున్న లారీ డ్రైవర్ పర్వతదేవరపల్లి వద్దకు చేరుకోగానే ఒక్కసారిగా వేగాన్ని తగ్గించాడు. దీంతో వెనుకనే వస్తున్న లారీ డ్రైవర్ గమనించి వేగాన్ని నియంత్రించుకునే సమయం కూడా లేకపోవడంతో నేరుగా వెళ్లి ముందున్న లారీని ఢీకొన్నాడు. ఘటనలో వెనుక ఉన్న లారీ క్యాబిన్ నుజ్జునుజ్జయింది. క్యాబిన్‌లోనే డ్రైవర్ ప్రసాద్ చిక్కుకున్నాడు. స్థానికులు గమనించి అతి కష్టంపై ఆయనను వెలికి తీశారు. అప్పటికే తీవ్ర రక్తస్రావంతో ఆయన మృతి చెందాడు. ఘటనపై కనగానపల్లి పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.
విద్యుత్ మీటర్ రీడర్ల నిరసన